1, జులై 2010, గురువారం

పురస్కృతమూర్తి స్తుతి - 8




ఎవరు? మరెవరు? ఇంకెవరు?!

మధుర మంజుల మనోజ్ఞ రసజ్ఞమూర్తి
పావన నవజీవన కవితావనదీప్తి
సుందర సురభిళ భావకవితారసస్ఫూర్తి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

తన ‘వజ్రాయుధాన్ని’ ఝళిపించి
తానేంటో నిరూపించిన
కవితా విపంచి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

అమృతతరంగిణి ఆ వీణాపాణి
దరహాస వాణిగా వీరి
‘మేఘరంజని’ ‘అక్షయతరంగిణి’ భాసిస్తే
పలుకుల చెలి కాలి నూపురంలా
‘రక్తాక్షి’ ‘కాహళి’ ప్రకాశిస్తే
మధురమోహన మురళీరవళిలా
వీరి ‘కళాకేళి’ సంపాదకత్వం
పాఠకహృదయాంతరాళలలో ప్రతిద్వనిస్తే

ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

వీరి కవిత
సాహితీభారతి నొసట తిలకం
వీరు సాహితీలోకానికి తలమానికం!
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి - 7



బహుముఖ ప్రతిభామతి - వాసా ప్రభావతి


స్వాతంత్ర్య బీజాలు జన్మచే మొలకెత్త
పెద్ద చైన్నులుగారి ముద్దుగుమ్మ
శాస్త్రిని చేపట్టి చదువులరాణివై
గుట్టుగాకూసిన కోయిలమ్మ
తెలుగు నారుల పోరు తేజమ్మునందంగ
కలముబట్టిన వీర కైతలమ్మ
గృహలక్ష్మి కంకణగేహినివైవెల్గి
వాసిగాంచినయో ప్రభావతమ్మ

గుండెలోని ప్రేమ గొంతులోనికి పొంగ
పలుకరించునట్టి పడతివమ్మ
వార్షికోత్సవాన వాసంత రాగాల
నాలపించినట్టి యతిథివమ్మ!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన :శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -6




వెలెస నండూరి వంశంబున వినుతికెక్క
రామకృష్ణమాచార్యుడు రమ్యమూర్తి
తెలుగుతల్లికి పుట్టిన వెలుగునీవు
తెలుగు సాహితీ జగతి తేజమయ్యె

మృదువైన భాషసంపద
ముదముగ పద్యాలు గూర్చు మురిపెముతోడన్
పదములు భావంబుధులే
చదువరులకు పంచిపెట్టె చక్కని కావ్యాల్

తెలుగు గడ్డమీద తనరంగనీకీర్తి
పద్యమందు మధువు పల్లవించె
భావపటిమ గల్గి భాసిల్లె పద్యంబు
రమ్యచరిత నీది రామకృష్ణ!
(రచన : శ్రీ భైరవభట్ల శివరామ్ )

పురస్కృతమూర్తి స్తుతి - 5




ఆనాటి కవిత్వమ్మును
కాణాచిగ నందిన ‘సురగాలి తిమోతి
జ్ఞానానందకవీశ్వర!
ఆనందమె నీ కవిత్వమందరి కొసగున్

విజయనగరజిలా వీరబొబ్బిలిదరి
పెదపెంకిలో పుట్టి ప్రియముగూర్చె
ప్రాచీన కవితనారాధించు కవిరాజు
ఖండకావ్యాల ప్రఖ్యాతకవియె
సంప్రదాయ కవిత్వ సారమ్ము గైకొని
పద్యకవితలు వ్రాసె హృద్యముగనె
‘ ఊ’ కూని రాగాల నుత్కృష్ట పద్యముల్
చక్కాగా చదువు' మీసాలె' కవియె

ఆమ్రపాళి మరియు నన్ని కావ్యమ్ములు
మణులు మరకతాలె ; మన ప్రభుత్వ
మందుచేత నిచ్చెనంత పద్మశ్రీ ని
కవిని గారవించె ప్రవిమలముగ!
(రచన : శ్రీ తూటబాబాజీ )

పురస్కృతమూర్తి స్తుతి - 4




చిన్నారిగేయాల జేజిమామయ్యయై
బాలాంతరంగపు బాలుడితడు
రాధ విరహగీతి మాధవునెద జల్లు
కవితామయ రజనీ కాంతుడితడు
సంగీత సాహిత్య సమ్మేళనమ్ముతో
సామవేదమ్ముల సారమితడు
ఆకాశవాణిలో అలలుగా సాగిన
లలితసంగీతాల లాస్యమితడు

తేనె లొలికించు తీయని తెలుగుపాట
హాయికలిగించు వినినంత నతని నోట
‘ రాధ కూతురు వా ’ యంచు రమ్మటంచు
పాత సంగతి తలపోసి పలుకరించె!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -3




కవితలకు కైమోడ్పు
ఏ కవితలకు ?
సుకవితలకు ?
ఎవరు సుకవి?

‘ కవితకోసమె నేను పుట్టాను
క్రాంతికోసమె కలం పట్టాను ’
అని తన పదముద్రలను
సాహితీప్రియుల ఎదలలో భద్రపరచుకున్న
నవవచో భద్రునకు
కవితా సముద్రునకు
‘ఆరుద్రు’నకు నా కై మోడ్పు

ఏకవితలకు ? సుకవితలకు !
ఎవరు సుకవి?

‘ సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర
అక్షరాలే అతని వేలుముద్ర వ్రాలుముద్ర ’
అని ముళ్ళపూడిచే కొనియాడబడ్డ
ఆ విశద యశస్వి, సుమనస్వి, కవితాతపస్వి
ఆరుద్రునకు నా కైమోడ్పులు

ఏకవితలకు? సుకవితలకు!
ఎవరు సుకవి?

తన సర్వస్వాన్ని ధారపోసి
‘ విజ్ఞాన సర్వస్వాన్ని’ లోకానికందించిన కవితావారాశి
‘ పలకలవెండిగ్లాసు’ లాంటి అపరాధపరిశోధక
నవలలందించిన నవనవోన్మేష నవలాకారుడు
‘ త్వమేవాహం’ అన్న కవికులైక భూషణుడు
‘సినీవాలి’ ని అందంగా ఆవిష్కరించిన
పలుకులచెలి గారాలపట్టి
వేలపాటలు , వేవేల కవితలు వ్రాసిన
ఆరుద్రుని కవితలకు నా కైమోడ్పులు
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి -2




జంధ్యాల పాపయ్యశాస్త్రి సత్కవిరాచు
కలము చక్కెరముంచి కవిత వ్రాసె
మధుర పదమ్ముల మధురాతి మధురమౌ
భావములొలికించె పద్యమల్లె
అనుప్రాసములు వాడి ఆనంద డోలికల్
నూగించె పాఠకునున్నతముగ
ఖండకావ్యమ్ములు కలకండ ఖండాలె
ఘంటసాల మధురకంఠ సీమ

పువ్వులేడుపు, కర్ణుని పుట్టు కతలు
బుద్ధభగవాను జీవన పుణ్యకథలు
వీరభారత విజయువిహారకథలు
తీపి పిల్లల శతకమ్ము ‘తెలుగుబాల’

కరుణశ్రీ బిరుదమ్ము నీకెతగు నీ కావ్యమ్ములే చాటు, ప
ల్మరు కావ్యమ్ముల ఖండికల్ హృదయమున్ మాధుర్యమున్ దేల్చు, సు
స్థిర సాహిత్యమె సౌరభాల ‘ఉదయశ్రీ’ కావ్య సత్ఖండికల్
సిరి, గీతామృత మాధురిచ్చు ‘విజయశ్రీ’ భారతాఖ్యానమున్
(రచన : శ్రీ తూటబాబాజీ )