1, జులై 2010, గురువారం

పురస్కృతమూర్తి స్తుతి - 8




ఎవరు? మరెవరు? ఇంకెవరు?!

మధుర మంజుల మనోజ్ఞ రసజ్ఞమూర్తి
పావన నవజీవన కవితావనదీప్తి
సుందర సురభిళ భావకవితారసస్ఫూర్తి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

తన ‘వజ్రాయుధాన్ని’ ఝళిపించి
తానేంటో నిరూపించిన
కవితా విపంచి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

అమృతతరంగిణి ఆ వీణాపాణి
దరహాస వాణిగా వీరి
‘మేఘరంజని’ ‘అక్షయతరంగిణి’ భాసిస్తే
పలుకుల చెలి కాలి నూపురంలా
‘రక్తాక్షి’ ‘కాహళి’ ప్రకాశిస్తే
మధురమోహన మురళీరవళిలా
వీరి ‘కళాకేళి’ సంపాదకత్వం
పాఠకహృదయాంతరాళలలో ప్రతిద్వనిస్తే

ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

వీరి కవిత
సాహితీభారతి నొసట తిలకం
వీరు సాహితీలోకానికి తలమానికం!
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి - 7



బహుముఖ ప్రతిభామతి - వాసా ప్రభావతి


స్వాతంత్ర్య బీజాలు జన్మచే మొలకెత్త
పెద్ద చైన్నులుగారి ముద్దుగుమ్మ
శాస్త్రిని చేపట్టి చదువులరాణివై
గుట్టుగాకూసిన కోయిలమ్మ
తెలుగు నారుల పోరు తేజమ్మునందంగ
కలముబట్టిన వీర కైతలమ్మ
గృహలక్ష్మి కంకణగేహినివైవెల్గి
వాసిగాంచినయో ప్రభావతమ్మ

గుండెలోని ప్రేమ గొంతులోనికి పొంగ
పలుకరించునట్టి పడతివమ్మ
వార్షికోత్సవాన వాసంత రాగాల
నాలపించినట్టి యతిథివమ్మ!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన :శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -6




వెలెస నండూరి వంశంబున వినుతికెక్క
రామకృష్ణమాచార్యుడు రమ్యమూర్తి
తెలుగుతల్లికి పుట్టిన వెలుగునీవు
తెలుగు సాహితీ జగతి తేజమయ్యె

మృదువైన భాషసంపద
ముదముగ పద్యాలు గూర్చు మురిపెముతోడన్
పదములు భావంబుధులే
చదువరులకు పంచిపెట్టె చక్కని కావ్యాల్

తెలుగు గడ్డమీద తనరంగనీకీర్తి
పద్యమందు మధువు పల్లవించె
భావపటిమ గల్గి భాసిల్లె పద్యంబు
రమ్యచరిత నీది రామకృష్ణ!
(రచన : శ్రీ భైరవభట్ల శివరామ్ )

పురస్కృతమూర్తి స్తుతి - 5




ఆనాటి కవిత్వమ్మును
కాణాచిగ నందిన ‘సురగాలి తిమోతి
జ్ఞానానందకవీశ్వర!
ఆనందమె నీ కవిత్వమందరి కొసగున్

విజయనగరజిలా వీరబొబ్బిలిదరి
పెదపెంకిలో పుట్టి ప్రియముగూర్చె
ప్రాచీన కవితనారాధించు కవిరాజు
ఖండకావ్యాల ప్రఖ్యాతకవియె
సంప్రదాయ కవిత్వ సారమ్ము గైకొని
పద్యకవితలు వ్రాసె హృద్యముగనె
‘ ఊ’ కూని రాగాల నుత్కృష్ట పద్యముల్
చక్కాగా చదువు' మీసాలె' కవియె

ఆమ్రపాళి మరియు నన్ని కావ్యమ్ములు
మణులు మరకతాలె ; మన ప్రభుత్వ
మందుచేత నిచ్చెనంత పద్మశ్రీ ని
కవిని గారవించె ప్రవిమలముగ!
(రచన : శ్రీ తూటబాబాజీ )

పురస్కృతమూర్తి స్తుతి - 4




చిన్నారిగేయాల జేజిమామయ్యయై
బాలాంతరంగపు బాలుడితడు
రాధ విరహగీతి మాధవునెద జల్లు
కవితామయ రజనీ కాంతుడితడు
సంగీత సాహిత్య సమ్మేళనమ్ముతో
సామవేదమ్ముల సారమితడు
ఆకాశవాణిలో అలలుగా సాగిన
లలితసంగీతాల లాస్యమితడు

తేనె లొలికించు తీయని తెలుగుపాట
హాయికలిగించు వినినంత నతని నోట
‘ రాధ కూతురు వా ’ యంచు రమ్మటంచు
పాత సంగతి తలపోసి పలుకరించె!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -3




కవితలకు కైమోడ్పు
ఏ కవితలకు ?
సుకవితలకు ?
ఎవరు సుకవి?

‘ కవితకోసమె నేను పుట్టాను
క్రాంతికోసమె కలం పట్టాను ’
అని తన పదముద్రలను
సాహితీప్రియుల ఎదలలో భద్రపరచుకున్న
నవవచో భద్రునకు
కవితా సముద్రునకు
‘ఆరుద్రు’నకు నా కై మోడ్పు

ఏకవితలకు ? సుకవితలకు !
ఎవరు సుకవి?

‘ సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర
అక్షరాలే అతని వేలుముద్ర వ్రాలుముద్ర ’
అని ముళ్ళపూడిచే కొనియాడబడ్డ
ఆ విశద యశస్వి, సుమనస్వి, కవితాతపస్వి
ఆరుద్రునకు నా కైమోడ్పులు

ఏకవితలకు? సుకవితలకు!
ఎవరు సుకవి?

తన సర్వస్వాన్ని ధారపోసి
‘ విజ్ఞాన సర్వస్వాన్ని’ లోకానికందించిన కవితావారాశి
‘ పలకలవెండిగ్లాసు’ లాంటి అపరాధపరిశోధక
నవలలందించిన నవనవోన్మేష నవలాకారుడు
‘ త్వమేవాహం’ అన్న కవికులైక భూషణుడు
‘సినీవాలి’ ని అందంగా ఆవిష్కరించిన
పలుకులచెలి గారాలపట్టి
వేలపాటలు , వేవేల కవితలు వ్రాసిన
ఆరుద్రుని కవితలకు నా కైమోడ్పులు
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి -2




జంధ్యాల పాపయ్యశాస్త్రి సత్కవిరాచు
కలము చక్కెరముంచి కవిత వ్రాసె
మధుర పదమ్ముల మధురాతి మధురమౌ
భావములొలికించె పద్యమల్లె
అనుప్రాసములు వాడి ఆనంద డోలికల్
నూగించె పాఠకునున్నతముగ
ఖండకావ్యమ్ములు కలకండ ఖండాలె
ఘంటసాల మధురకంఠ సీమ

పువ్వులేడుపు, కర్ణుని పుట్టు కతలు
బుద్ధభగవాను జీవన పుణ్యకథలు
వీరభారత విజయువిహారకథలు
తీపి పిల్లల శతకమ్ము ‘తెలుగుబాల’

కరుణశ్రీ బిరుదమ్ము నీకెతగు నీ కావ్యమ్ములే చాటు, ప
ల్మరు కావ్యమ్ముల ఖండికల్ హృదయమున్ మాధుర్యమున్ దేల్చు, సు
స్థిర సాహిత్యమె సౌరభాల ‘ఉదయశ్రీ’ కావ్య సత్ఖండికల్
సిరి, గీతామృత మాధురిచ్చు ‘విజయశ్రీ’ భారతాఖ్యానమున్
(రచన : శ్రీ తూటబాబాజీ )

పురస్కృతమూర్తి స్తుతి -1




శ్రీ మధునాపంతుల ఘన
శ్రీ మహిమాన్విత కవిత్వ సిద్ధుడవగుచున్
ధామంబైవెలుగొందుచు
మా మానసమందు నిల్చె మహనీయముగాన్

ఆదితాంబూలమిచ్చుచు ఆదరించె
భాసురంబుగను విజయభావనందు
భవ్యవైతాళికుండవు భాషయందు
తేనెలొలికెడి తెలుగులో తేటమవగ

ఆంధ్రపురాణకృతియె అద్భుతంగు
ఆంధ్రకీర్తిని చాటెను అన్నిదెశల
హర్షవర్షంబు కురిసెను ఆంధ్రయంత
అట్టి సుకవికి నేనును అంజలిడుదు!
(రచన : శ్రీ భైరవభట్ల శివరామ్ )

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మూడువందల అరవైయ్యవ సభ

కవితాచమత్కృతి

అధ్యక్షులు : శ్రీ మేకా కాశీవిశ్వేశ్వరుడు
(మున్సిపల్ కౌన్సిలర్, డైరక్టర్: సిటీ కేబుల్, విజయనగరం)
వక్త : డా || యస్. టి. పి. శ్రీనివాసాచార్యులు
(ప్రథమ శ్రేణి తెలుగు పండితులు, కొండకర్ల )
విషయం : దక్షిణాంధ్ర యుగ ప్రబంధాలు - చమత్కారాలు
సమ్మానకర్త : సహజకవి శ్రీ తూట బాబాజీ
(కార్యవర్గ సభ్యులు, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 25-04-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

10, మార్చి 2010, బుధవారం

మూడువందల యాభైయ్యెనిమిదవ, మూడువందలయాభైతొమ్మిదవ సభలు

ఇరవై అయిదవ వార్షికోత్సవము - రజతోత్సవవము
శ్రీవికృతి ఉగాది

ప్రకృతి - ప్రగతి

అధ్యక్షులు : శ్రీ రావి. ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
జ్యోతిప్రకాశనం : శ్రీ సిహెచ్. అప్పలరాజు,
(ప్రొ|| సాయిబాబా పవర్‍ప్రస్)
ఫోటో ఎగ్జిబిషన్ : విజయనగర్ ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్
ప్రెసిడెంట్ : వి. ఆర్. రామునాయుడు; సెక్రటరీ : వి. రాజశేఖర్
ప్రారంభకులు : Rt శ్రీ. జి. శివకుమార్
(మేనేజింగ్ డైరెక్టర్, ఎస్. వి. ఎన్. లేక్ పేలస్)
ముఖ్య అతిథి : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ప్రముఖ సంపాదకులు, హైదరాబాద్)
ప్రత్యేక అతిథి : డా|| యు. ఎ. నరసింహమూర్తి(ప్రఖ్యాత సాహితీమూర్తి) గారికి
విజయభావన సమ్మానం
సంపూర్ణ శతావధాన గ్రంథావిష్కరణ
జ్ఞాపికలప్రదాత : డా|| వై. బాబూరావు
(ప్రొప్రయిటర్, హోటల్ మయూర)

పురస్కృతమూర్తి స్తుతి

అధ్యక్షులు : శ్రీ బులుసు జి ప్రకాష్
(ఉపాధ్యక్షులు, విజయభావన)
సమన్వయకర్త : డా|| ఎ. గోపాలరావు
(ప్రధాన కార్యదర్శి, విజయభావన)
జ్ఞాపికల ప్రదాత : శ్రీ ధవళ సర్వేశ్వరరావు
(అధ్యక్షులు, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్)

కుమారి నడిమింటి విజయలక్ష్మి : ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, శారదా అశోక్ వర్థన్
శ్రీ బిహెచ్. శివరామ్ : మధునాపంతుల, నండూరి
శ్రీ తూట బాబాజీ : కరుణశ్రీ, ఎస్ టి. జ్ఞానానంద కవి
డా|| జక్కు రామకృష్ణ : మిక్కిలినేని, గొల్లపూడి
శ్రీమతి బిహెచ్. దేవీప్రకాశమ్మ : రజనీకాంతరావు, వాసా ప్రభావతి
శ్రీమతి పి. ఈశ్వరీమోహన్ : నాయని కృష్ణకుమారి, జి. వి . సుబ్రహ్మణ్యం
శ్రీ బిహెచ్. బాబూజీ : మాలతీ చందూర్, ద్వివేదుల విశాలాక్షి
శ్రీ బిహెచ్. నరసింహం : కొత్తపల్లి వీరభద్రరావు, పాలంకి
శ్రీ పి. శిరీషా రఘునాథశర్మ : ఉత్పల సత్యనారాయణ, శలాక రఘునాథ శర్మ
శ్రీ కె. శారదాప్రసాద్ : ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్
శ్రీమతి ఎ. లలితాశంకర్ : భ.రా.గో., రావూరి భరద్వాజ
కుమారి అడిదం ఇందిరాంబ : బోయిభీమన్న, ఆచార్య ఎన్. గోపి

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం ఉద|| 9.30 గం||


చైత్రప్రభ

అధ్యక్షులు : సేవాశిరోమణి శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.ఎల్.ఎ
(అధ్యక్షులు, శ్రీ సాయి ఫౌండేషన్; ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, విజయనగరం)

పురస్కారగ్రహీత : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ఆం.ప్ర. ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు)
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
(పురపాలక సంఘాధ్యక్షులు, విజయనగరం)

జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. వి. ఎస్. కె. ప్రసాద్
(హిమాంశు బుక్ డిపో)
విద్యార్థులకు, కళాకారులకు జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. కృష్ణమూర్తి
(ప్రముఖ న్యాయవాది)(కీ||శే|| కూరెళ్ళ వేంకటశాస్త్రి అండ్
మనోరమ మొమోరియల్ ట్రస్టు)

రాష్ట్రస్థాయి ఉత్తమ శతకసాహిత్య వ్యాస స్పర్థ విజేత : శ్రీ ద్వాదశి సుబ్రహ్మణ్యప్రభాకరరావు, తెలుగుపండిట్, కాకినాడ

బహుమతి ప్రదాత : శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)

సాంస్కృతిక కార్యక్రమాలు (సభాప్రారంభంలో)
నృత్య ప్రదర్శనలు : నిర్వహణ - నర్తనశాల , డి. రాధికారాణి
మిమిక్రీ : దాదా (నెల్లిమర్ల)
మేజిక్ : సలీమ్ (విజయనగరం)



వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం సా|| 6.00 గం||

18, ఫిబ్రవరి 2010, గురువారం

మూడువందల యాభైయ్యేడవ సభ

శంకరవాణి

అధ్యక్షులు : శ్రీ గురాన సాధూరావు
(ప్రముఖ సమాజసేవకులు, విజయనగరం)
వక్త : శ్రీ సర్వాజోశ్యుల గౌరీశంకరశాస్త్రి
(తెలుగు పండితులు, రాజుల తాళ్ళవలస )
విషయం : శివానందలహరి
సమ్మానకర్త : శ్రీ భైరవభట్ల నరసింహం
(కోశాధికారి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 28-02-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

17, ఫిబ్రవరి 2010, బుధవారం

వసుచరిత్రవైచిత్రి

సభకు ఆహ్వానం డా|| జక్కు రామకృష్ణగారు పలుకుతూ, అధ్యక్షులైన ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. రాజు గారిని, ఆయన శ్రీ సాగిశివసీతారామరాజు కళాపీఠంచే చేస్తున్న సేవను, ఇతర సంస్థలకు అందిస్తున్న సహాయాన్ని, ముఖ్యంగా పుస్తక ప్రచారానికి ఆయన చేస్తున్న కృషిని శ్లాఘించారు. వక్త శ్రీ కోటారావుగారిని ఆహ్వానిస్తూ, కవిగా, విమర్శకునిగా కృషిని కొనియాడుతూ మేలి జాతిరత్నంగా అభివర్ణించారు. ఆశుపద్య రచనలో ఆయన ప్రతిభ ద్వారా, భువనవిజయం లో తిమ్మరసుగా, ఆయన సుపరిచితులని గుర్తుచేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ గారిని ఆహ్వానిస్తూ, స్వర్గీయ మోహన్ గారి దీప్తిని కొనసాగిస్తున్న ఆమె కృషిని అభినందించారు. అనంతరం శ్రీ కాగుపాటి నారాయణరావు గారు ప్రార్థన చేశారు. అధ్యక్షులు శ్రీ రాజు గారు మాట్లాడుతూ విజయభావన తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. విజయభావనను సాహిత్యానికి యూనివర్సిటీగా పేర్కొన్నారు. సాహిత్యం ద్వారా విలువలు పెరుగుతాయన్నారు. అందుకే పుస్తకపఠనాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీకుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. పుస్తక ప్రచురణ, ప్రదర్శన కొరకై తమ సంస్థ చేస్తున్న పనులను వివరించారు. పుస్తకాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడానికి చేయవలసిన సూచనలు చేశారు. తమకు పుస్తకాలను సగం ధరకు అమ్మినవాళ్ళకు, తమదగ్గర సగం ధర ఇచ్చి కొన్న వాళ్ళకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ మాట్లాడుతూ భాషాపరిజ్ఞానానికి ప్రబంధ పఠనం అవసరం అని, రామరాజ భూషణుని వసుచరిత్ర అత్యుత్తమమైన రచన అని తెలిపారు. అనంతరం శ్రీ కోటారావుగారిని సమ్మానించారు. సమ్మానంతరం ‘వసుచరిత్ర వైచిత్రి’ పై శ్రీ కోటారావుగారు ప్రసంగిస్తూ, విజయనగరంలో తను చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ తనకు కనువిప్పు ఇక్కడే కలిగిందిఅని చమత్కరించారు. విజయభావనలో మాట్లాడితే ఒక తృప్తి ఉంటుంది అని, ఎప్పుడు ఆదేశించినా వస్తానని తెలిపారు. శ్రీ శారదా ప్రసాద్ గారు వందన సమర్పణ చేశారు.
ప్రసంగ సారాన్ని పద్యం.నెట్ లో పొందుపరుచుట జరిగింది.

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శతావధానం - పద్యాలు

విజయభావన ఆధ్వర్యంలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి శతావధాన కార్యక్రమం ఈ డిసంబరు 25-27 తారీఖులలో దిగ్విజయంగా నిర్వహింపబడినది. అందులోని అంశాలను, పూరించిన పద్యాలను పద్యం.నెట్ లో చూడండి.

15, జనవరి 2010, శుక్రవారం

మూడువందల యాభైయ్యారవ సభ

వసుచరిత్ర వైచిత్రి

అధ్యక్షులు : శ్రీ ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. ఆర్. ఎమ్. రాజు
(ప్రముఖ న్యాయవాది, వ్యవస్థాపకులు సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం, విజయనగరం)
వక్త : శ్రీ కె. కోటారావు, భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎం.ఎ
(ఆంధ్రపద్య కవితా సదస్సు విశాఖ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి )
విషయం : రామరాజ భూషణుని కవితా రామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి పి. ఈశ్వరీమోహన్
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 31-01-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

16, డిసెంబర్ 2009, బుధవారం

శతావధాన సాహితీ క్రతువు

తేదీలు : 25,26,27 డిశెంబరు, 2009
సమయం : ప్రతి రోజూ ఉదయం 9 గం|| ల నుండి 1 గం|| వరకు
సాయంత్రం 4 గం|| ల నుండి 8 గం ||ల వరకు

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం - విజయనగరం

అవధాని : సహస్ర భారతి, మహా సహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసుడు
డా|| గరికిపాటి నరసింహారావు

సంచాలకులు : శ్రీ పేరి రవికుమార్

అప్రస్తుత ప్రసంగం : శ్రీ రాంభట్ల నృసింహశర్మ (ఆకాశవాణి, విశాఖ)
శ్రీ ధవళ సర్వేశ్వరరావు
డా|| జక్కు రామకృష్ణ
డా|| భైరవభట్ల విజయాదిత్య
పృచ్చకులు :

సమస్య : అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, శ్రీ కె. మార్కండేయులు, శ్రీ క్రొవ్విడి శారదా ప్రసాద్, శ్రీ కె. పి. ఎస్. పంతులు, డా|| తాతా వెంకటలక్ష్మి, శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్, శ్రీ తూట బాబాజీ, శ్రీ ఎస్. శ్రీకాంత్, శ్రీ ఎమ్. వి. కృష్ణమూర్తి, శ్రీ కొణిశ హరి, డా|| టి. జి. కృష్టారావు, శ్రీ కె. బాబూరావు, శ్రీ పి. వి. రాధాకృష్ణ, డా|| పి. టి. జి. రంగాచార్యులు, అవధాని కె. చంద్రశేఖర్, శ్రీ బి. హెచ్. శివరామ్, శ్రీ ఎ. రాధాప్రసాద్, శ్రీ నేతేటి గణేశ్వరరావు, శ్రీ ఆర్. సత్యం, శ్రీ కె. పూజ్యనాథాచారి, శ్రీ జి. సన్యాసినాయుడు, శ్రీ సర్వాజోస్యుల గౌరీశంకరశాస్త్రి, శ్రీ వి. రమణ, శ్రీ టి. సత్యనారాయణ

దత్తపది : శ్రీమతి బి. హెచ్. దేవీప్రకాష్, శ్రీ నల్ల బాలకృష్ణ, శ్రీ కిలపర్తి దాలినాయుడు, శ్రీ గుమ్మా రంగారావు, శ్రీ పి. వెంకటకృష్ణయ్య, కుమారి ఎల్. సీతామహాలక్ష్మి, కుమారి పి. స్వాతి, శ్రీ ఆర్. పవన్‍కుమార్, శ్రీమతి బి. విజయభారతి, శ్రీ పి. రాజేశ్వరరావు, శ్రీ టి. రమణ, డా|| ఆర్. శశికళ, డా|| సి. సూర్యనారాయణ, శ్రీ బెహరా గణేశ్, కుమారి అడిదం శారద, శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు, శ్రీ కె. వి. జగన్నాథరావు, శ్రీ బి. రామజోగారావు, శ్రీ చౌదరి చిట్టన్న, శ్రీ ఎమ్. పార్వతీశం, కుమారి బి. తారకేశ్వరి, కుమారి కె. ఎన్. ఎస్. హైమవతి, శ్రీ బి. కోటారావు, కుమారి కె. సంతోషిలక్ష్మి, శ్రీ వి. శ్రీను.

వర్ణన : శ్రీమతి గుమ్మా చంపావతి, శ్రీమతి పి. హేమకామేశ్వరి, శ్రీ దేవరకొండ రామనరసింగరావు, శ్రీ బి. హెచ్. కె. బాబూజి, శ్రీ జి. ఆర్. రాఘవరాజు, శ్రీ ఎ. సదాశివరాజు, శ్రీ ఆర్. నాగార్జునరావు, శ్రీ పి. లక్ష్మణరావు, శ్రీ ఎస్. సోమేశ్వరరావు, శ్రీమతి ఎ. లలితాశంకర్, శ్రీ చిట్టెళ్ళ వెంకట సుబ్రహ్మణ్యశర్మ, శ్రీ జి. గోవిందరాజు, శ్రీ వి. నీలకంఠాచారి, శ్రీమతి బి. రుక్మిణి, శ్రీమతి సి. హెచ్. ఎస్. ఎల్. నరసమ్మ, శ్రీమతి ఆర్. లక్ష్మి, కుమారి పి. కారుణ్యకవిత, కుమారి వై. భార్గవి, శ్రీ జి. రమణమూర్తి, శ్రీ దివ్వెల చిన్నారావు, శ్రీమతి పేరి సావిత్రి, శ్రీ రేవళ్ల ఆదినారాయణ, శ్రీమతి సి. హెచ్. శ్రీలక్ష్మి, శ్రీమతి భావవరపు సత్యవతి, శ్రీ గన్నవరపు దుర్గాప్రసాద్.

ఆశువు : 25 గురు ఎంపిక చేసిన సహృదయ ప్రేక్షకులే పృచ్ఛకులు

శతావధాన సభలు

శతావధాన ప్రారంభ సభ

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
జ్యోతిప్రకాశకులు : శ్రీ గురాన సాధూరావు
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు
అవధాని : మహాసహస్రావధాని
డా|| గరికిపాటి నరసింహారావు
ముఖ్య అతిథి : శ్రీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎం.ఎల్.సి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు
విశిష్ట అతిథి : శ్రీ వి. వి. కాశీవిశ్వనాథం
పూర్వాధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం
అవధాన సంచాలకులు : ప్రఖ్యాత సాహితీవేత్త
శ్రీ పేరి రవికుమార్, విశాఖ

సమయం : తే|| 25-12-2009 ఆదివారం, సాయంత్రం గం|| 9.00 గం|| లకు


శతావధాన సమాపనం - సమ్మాన వైభవం

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి
అధ్యక్షులు, శ్రీసాయి ఫౌండేషన్
పురస్కార గ్రహీత : ధారణా బ్రహ్మరాక్షస - సహస్రభారతి
డా|| గరికిపాటి నరసింహారావు
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
మ్యున్సిపల్ చైర్మన్, విజయనగరం
గౌరవాతిథి : డా|| పి. లక్ష్మీనరసింహం, ఐ.ఎ.యస్
జాయింట్ కలెక్టర్, విజయనగరం.

ప్రత్యేక ఆహ్వానితులు : శ్రీ సి. యన్. జె. డి. ప్రసాద్
రీజనల్ మేనేజర్, రీజియన్ 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విశాఖపట్నం.
: శ్రీ కె. ఆనందకుమార్
ఎఐయమ్ కాన్సెప్ట్ స్కూలు, విజయనగరం
: శ్రీ ఇ. ఆర్. సోమయాజులు (రాంజీ)
చార్టర్డ్ అకౌంటెంట్, విజయనగరం

2, డిసెంబర్ 2009, బుధవారం

తెలుగు వెలుగు

సభాప్రారంభాన్ని చేస్తూ డా|| ఎ. గోపాలరావు, శారదరాత్రులలో పూర్ణచంద్రుని, సుధాకరుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదని చమత్కరిస్తూ అధ్యక్షులైన సుధాకర్ గారిని, వక్త పూర్ణచందు గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. అటుపైన సమ్మానకర్త ఇందిరాంబగారికి ఆహ్వానం పలికారు. ప్రార్థన శ్రీ పంతులు చేయగా, అధ్యక్షులు శ్రీ సుధాకర్ మాట్లాడుతూ సాహిత్యకార్యక్రమాలలో పాల్గొంటే మంచి ఆలోచనలు వస్తాయని, జ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. విజయభావన సంస్థగురించి చెబుతూ ఇన్నేళ్ళూగా నిర్విరామంగా పనిచేస్తున్న సాహిత్య సంస్థ మరోటి లేదని కొనియాడారు. తనకు సాహిత్యంలో ప్రవేశం లేకపోయినా, చేసేవాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఉత్తమమని భావించి వస్తూన్నానని తెలిపారు. సమ్మానకర్త కుమారి ఇందిరాంబ మాట్లాడుతూ విజయభావన కీ||శే|| ఆచార్య భావన్ గారి సంకల్పబలం చేత, అందరిసహకారం చేత, సభ్యుల అంకితభావం చేత విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. అనంతరం వక్తను సత్కరించారు.

సమ్మానకార్యక్రమానంతరం వక్త శ్రీ పూర్ణచందు తెలుగు భాష ప్రాచేనత- నూతన పరిశోధనాంశాలు అనే విషయం పై ప్రసంగిస్తూ విజయభావనలో ప్రసంగించడం ఒక యోగ్యతా పత్రంగా భావిస్తాంమని, తను చెప్పాలనుకున్న అంశాలను సాంస్కృతికరాజధాని గా భావించే విజయనగరంలో చెప్పాలని తన ఆకాంక్ష అని, అది తనబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. (ఆసమయంలో కరెంటు పోయింది. కొవ్వత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం ప్రయత్నించగా సభలో ఎవరివద్దా దొరకలేదు. గ్రంథాలయం సిబ్బంది సకాలంలో వేరే ఏర్పాటు చేశారు. దీనిని చమత్కరిస్తూ శ్రీ పూర్ణచందు ‘విజయభావన సభకు వచ్చేవాళ్ళదగ్గర అగ్గిపెట్టె దొరకదు, అగ్గి పెట్టే వాళ్ళూ దొరకరు. ఇంతటి సంస్కారవంతులు కనుకే తను ఇక్కడ ఉపన్యసించాలనుకుంటున్నా’ అని అని నవ్వులు పూయించారు). సభ చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రభావితం చెయ్యగల వ్యక్తులు ఉంటే అది మహా సభ అవుతుందని అటువంటి ఈ మహా సభ కు వందనం చేస్తున్నానని తెలిపి ప్రసంగాన్ని ప్రారంభించారు.

గమనిక : విషయం యొక్క క్లిష్టతచేత, కేవలం అప్పటికప్పుడు విని వ్రాసుకున్న విషయాలను ఆతరువాత కూర్చి వ్యాసం చేయడం చేత వక్త చెప్పినదంతా వ్యాసంలో పొందుపరచలేకపోయి ఉండవచ్చు. అదేవిధంగా వ్యాసంలో కొన్ని తప్పులు, తేడాలు కూడా దొర్లి ఉండవచ్చు. దానికి మీకు, వక్త కి క్షమాపణ తెలుపుకుంటున్నాం. వ్యాసం చదివేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవలసిందిగా ప్రార్థన.

ఆ ప్రసంగ సారాంశం :
ఇక్కడ నేను రెండు విషయాలు పై మాట్లాడదలుచుకున్నాను. ఒకటి తెలుగు భాష ప్రమాదం అంచున ఉన్నదా అన్న ప్రశ్న. ప్రస్తుతం ప్రధానంగా ముప్ఫై ఏడు భాషలు మరణించే స్థితిలో ఉన్నాయి. నిజానికి భాష ఎక్కడికీ పోదు. గ్రంథాల రూపంలో, శాసనాల రూపంలో, ఇతర మాధ్యమాల రూపంలో ఉంటుంది. అయితే అది ప్రజల నాలుక పై ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఉదాహరణకి సంస్కృతం ఇప్పటికీ గ్రంథాలలో సజీవంగానే ఉంది. అయితే ఎంతమంది దానిని వాడకంలో ఉపయోగిస్తున్నారు? ఇక తెలుగు విషయానికి వస్తే ‘ బస్ స్పీడ్ గా పోతుంది’. ఇది సాధారణంగా అనే వాక్యం. ఇందులో ‘పోతుంది’ అనే వాక్యం ఒక్కటే తెలుగు పదం. ఇదెప్పుడు ‘పోతుందో’ తెలియదు! ప్రస్తుతం తెలుగు రాదని చెప్పడం గొప్పగా భావించడం వల్లే మరణిస్తోంది. అంతమాత్రంచేత తెలుగు భాషోద్యమం ఇతరభాషలుకు వ్యతిరేకం కాదు. మన భాషను ప్రేమించడానికి, భాషపై అభిమానాన్ని పెంచడానికి మాత్రంమే మా (తెలుగు భాషోద్యమం) ప్రయత్నం. ఇక్కడ గుర్తుంచుకోవలసింది, ప్రజాభిమతంలేని రాజకీయం భాషాదురభిమానానికి దారితీస్తుంది. ఉదాహరణకి మహారాష్ట్రా. ప్రజాభిమతంతో రాజకీయం జోడైతే సత్ఫలితాలిస్తుంది. ఉదాహరణకి తమిళనాడు. ప్రజాభ్జీష్టం మేరకు తమిళానికి ప్రాచీనహోదా కోసం డి.ఎం.కె ప్రభుత్వం కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి, కమిటీ వేయించారు. వాళ్ళు నో అబ్జక్షన్ చెప్పినతరువాత ప్రాచీన హోదాను కల్పించారు. అప్పుడు తెలుగు వారికి వేడి పుట్టి ఆ వైపుగా కృషి జరిగింది. అయితే తెలుగుభాషోద్యమం అంతకు ముందు నుంచీ ఉన్నదే. నిజానికి గిడుగువారి వ్యవహారిక భాషోద్యమానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఆనాడు సంస్కృతపండితులు మొదలైన వారు అడ్డంకిగా ఉంటే ఇప్పుడు మామూలు ప్రజలే అడ్డంకిగా ఉన్నారు. తెలుగు భాష ఇంటిభాషగా, బడిభాషగా, ఏలుబడిభాషగా ఉండాలన్నదే మా అభిలాష.

ఇక పరిశోధనాంశాల విషయానికి వస్తే, ఇంకా గ్రంథస్థంకాని తాజా పరిశోధనాంశాలను మీ దృష్టికి తేవాలనే సంకల్పంతోనే ఇక్కడకు రావడం జరిగింది. ఈ మధ్య జరిగిన మైదుకూరు సంఘటన తెలిసినవిషయమే. జన్మలో తెలుగులో మాట్లాడనని వ్రాయించి, తెలుగుపై ధ్వేషంన్ని పెంచుతున్నారు. ఇటువంటి సంఘటన మొదటిది కాదు, చివరిదీ కాబోదు. అది అలా ఉంచితే, తాజాగా వచ్చిన ఒక వార్త. ఈ నవంబరు ఐదున ఒక జర్మన్ వెబ్సైట్లో పరిశోధకులు తమ పరిశోధనా వివరాలను ఉంచారు. అప్పుడే పుట్టిన సద్యోజాత శిశువు ఏడుపు మాతృభాషలో ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకై వారు అప్పుడే పుట్టిన ఫ్రెంచ్ పిల్లల, జర్మన్ పిల్లల ఏడుపులు విశ్లేషించారు. తేడాలు గమనించారు. జర్మన్ పదాలు హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. అదే ఫ్రెంచ్ లో అయితే సాధారణంగా తగ్గు స్వరాలనుండి హెచ్చు స్వరాలకు వెళ్తాయి. పిల్లల ఏడుపులు సరిగ్గా వీటికి సరిపోయాయి. ‘ఎవరి ఏడుపు వారిదే మరి!’ . ఇక తెలుగు భాషలో సాధారణంగా హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. దానికితగ్గట్టే మామనవరాలి ఏడుపు ను గమనించాను. ‘ఉంగా’ అన్నప్పుడు మొదటి అక్షరం హెచ్చు స్వరంతోనూ, రెండవ అక్షరం తగ్గుస్వరంతోనూ పలుకింది. అంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకుకూడా మాతృభాషా జ్ఞానం ఉంటుంది. ఈ విషయాలపై సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆయన ప్రకారం బిడ్డ కడుపులో ఉండగానే (ముఖ్యంగా 8,9,10 నెలలలో) మనసు ఏర్పడుతుంది. నిజానికి మన భారతీయులు ఎప్పుడో నాలుగు నెలలు నిండిన గర్భిణిని ‘దౌహృదిని’ (రెండు మనసులు కలది ) అని నిర్ణయించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనిషిలో conscious, unconscious, preconscious స్థితులు ఉంటాయి. ఇవే ed, ego, super ego గా పనిచేస్తాయి (Georg Groddeck ). లోపల మనసునుంచి అనేక ప్రేరణలు కలుగుతాయి. ఇది ed వల్ల జరిగుతాయి. వాటికి అనుగుణంగా చెయ్యమని ego చెబుతుంది. అలా చెయ్యవద్దని చెప్పేదే super ego . వీటిని మనం సత్వరజస్తమో గుణాలుగా చూడవచ్చు (సత్వగుణం - super ego, రజోగుణం - ego, తమోగుణం - ed ) . చంటిపిల్లలు తమోగుణం కలిగినవారు. ఏం అనిపిస్తే అది చేసేస్తారు. యుక్తాయుక్త విచక్షణలేని unconscious స్థితిలో ఉంటారు. ఆస్థితిలోనే తల్లి ఆలోచనలను, సంస్కృతిని, మాటలను మనసుచే ఆకళింపు చేసుకుంటుంది. మూడేళ్ళవరకూ మాతృభాషలోనే మనసు గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. ఆరేళ్ళునిండకుండా స్కూలుకి వెళ్ళినప్పుడు బలవంతంగా ఏకమాధ్యమాన్ని రుద్దితే దాని ప్రభావంచేత guilty conscious ఏర్పడుతుంది. తెలుగులో ఆలోచిస్తూ తప్పుచేశానన్న అపరాధ భావన చే ఆత్మనూన్యతా భావం, అనేక personality disorders . ఇతరభాషలు నేర్చుకోవండంలో తప్పు లేదు ఆరేళ్ళతరువాత అవి నేర్చుకోవచ్చు. అయితే ఈ కార్పరేట్ స్కూల్స్ లో చదివిన వారికి isolation పెరిగి, peer group మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. మన సంస్కృతి నుండే భాష ఏర్పడుతుంది. సంస్కృతికి తగ్గట్టుగా భాషా పదాలు ఉంటాయి. అలా అని చెప్పి సంస్కృతపదాలు పెట్టేసి అది తెలుగు అనడం కూడా సరికాదు.

ఇక ఫ్రాయిడ్ కలల గురించి చెబుతూ, కలలలో వ్యక్తిగత విషయాలే కనిపిస్తుంటాయి, అవి మాతృభాషలోనే ఉంటాయి అని అంటారు. కలలకు కారణాలు, వాటిద్వారా అందే సంకేతాలు మాతృభాష పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక బ్రిటన్ వానికి కలలో పిల్లి కనిపిస్తే there are many ways to peel a cat' అన్న వారి నానుడి ప్రకారం అతను చేయబోయే పని కి ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటిని ఆలోచించమని చెప్పినట్టు లెఖ్ఖ అవుతుంది. అదే తెలుగు వాడికి పిల్లి కలలోకొస్తే మన జాతీయాలకి అనుగుణంగా అర్థం ఉంటుంది. (‘పిల్లి కళ్ళుమూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడటంలేదు అనుకుంటుంది’ మొదలైనవి). నిజానికి మనసు కేవలం మాతృభాషలో ఉంటుంది. కనుక ధారణ చేస్తే దానిలో చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. అందుకే సైన్సు పాఠాలలో సంస్కృతాన్ని వీడి తెలుగుకు ప్రాధాన్యతనిస్తే సులువుగా ఉంటుంది. ఉదాహరణకి ఫెర్న్ మొక్క యొక్క ‘ circinate vernation ’ అన్న దానికి ‘వలితకిసలయ విన్యాసం’ అని తెలుగు పుస్తకంలో అనువదిస్తే ఉభయభ్రష్టత్వంతప్ప ఉపయోగం ఉండదు. ఈ విధంగా చేయడం వల్లనే తెలుగు మీడియం చదువులు దెబ్బతిన్నాయి. అదే తెలుగులో సరళీకరించి ఉంటే తెలుగు మీడియం మరింత అభివృద్ధి చెంది ఉండేది. పెళ్ళిమంత్రాలు సంస్కృతంలో చదివి ఉపయేగం ఏమిటి. తెలుగులో చెబితే సులభంగా అర్థం మనసుకు తెలుస్తుందికదా! దేవునికి తెలుగురాదనా? మధ్యలో వేరొకరు ఏదో అంటే ‘మమ’ అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
అప్పటి భాషోద్యమాన్ని తీసుకుంటే తెలుగులో వ్రాయడం చిన్నతనంగా భావించేవారు పండితులు. అదే ఈరోజు తెలుగులో మాట్లాడడమే తక్కువగా భావిస్తున్నారు ప్రజలు.

నిజానికి మన తెలుగు భాష యొక్క మూలాలను గురించి చూస్తే, ఇది ద్రవిడ భాషా కుటుంబానికి (ప్రచారంలో ఉన్న పదం) చెందినది. మనదేశంలో ద్రవిడభాషాకుటుంబం, ఇన్డో ఆంగ్లో కుటుంబం, ముండా భాష కుటుంబం, చైనా కుటుంబాలు వున్నాయి. ఈ భాషా విషయాలపై ఎంతోమంది ప్రస్తుతం కృషిచేస్తున్నారు. ముఖ్యంగా Michael Weiss, Werner Winter, Bernard Vincent విశేష కృషి చేస్తున్నారు. F.B.J. Kuiper ఋగ్వేదంలో వేదభాషకు సంబంధంలేని పదాలు మూడువందలు ఉన్నాయని కనుగొన్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి సంస్కృతవాఙ్మయ చరిత్రలో వేదభాషగురించి, సంస్కృత భాషగురించి విపులంగా వివరించారు. తెరువాత పరిశోధనలలో సుమారు ఎనిమిది వందలు పదాలు ఇండో యూరోపియన్ భాషకు చెందని పదాలు కనుకున్నారు. ఉదాహరణకి గజ, పతి , కూర్పాసం ఇతర భాషా పదాలు. ఈ పరిశోధనలద్వారా ఈ భాషలకు మూలమైన proto indo european భాషను reconstruct చేశారు. అదేవిధంగా ప్రోటో ద్రవిడియన్ ఫ్యామలీ ని గుర్తించారు. ఇందులో నార్త్ ప్రోటో ద్రవిడ (బ్రాహులి - ఆఫ్గన్లో మాట్లాడే ఒక భాష), సెంట్రల్ ప్రోటో ద్రవిడ (తెలుగు), సౌత్ ప్రోటో ద్రవిడ భాషలు (తమిళ, మళయాళం) ఉన్నాయి. వేదభాషలో ఎక్కువగా నార్త్, సెంట్రల్ ప్రోటో ద్రవిడభాషలనుండి పదాలు కనిపిస్తాయి. సౌత్ ప్రోటో ద్రవిడ భాషలకు సంబంధించిన పదాలు కనపడవు. (ప్రోటో ముండా భాషనుండి కూడా వేదభాషలోకి పదాలు వెళ్ళాయి. ఉదా: వరి అన్నపదం, అసలు ముండా అన్న పదం నుండే ముండనం మొదలైనవి వచ్చాయి.) పై విషయాలను చూస్తే ముందుగా తెలుగే విడివడి ఉండడానికి అవకాశం ఉంది కనుక తెలుగే తమిళంకన్నా ప్రాచీనం కావలసి ఉంది. సంస్కృతం కన్నా తెలుగు ప్రాచీనమా కాదా అన్న విషయాన్ని కూడా పరిశోధించవలసి ఉన్నది.

ఇక పూర్వం ఆర్కియాలజిష్టులు, డక్కన్ ప్రాంతంలో దొరికిన అవశేషాలను సైతము ఇన్డియన్ అని అనేసి వదిలేశారు దానివలన అది సింధునాగరికతకు సంబంధించినదే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. నిజానికి సింధునాగరికతకు సమాంతరంగా డక్కన్ భూభాగంలోనూ నాగరికత విరాజిల్లింది. ఇనుమును కరిగించగలిగారని కూడా ఆధారాలున్నాయి. మరి ఈ నాగరికతను తెలుగునాగరికత అని ఎందుకు అనరు? ఎందుకు అనలేదు? ఈ విషయమై మేము (కృష్ణా జిల్లా రచయితల సంఘం) సింధు కృష్ణా నాగరికతల సదస్సు ఏర్పాటు చేసి ఆర్కియాలజిష్టులను రప్పించి వాటిపై చర్చను పెట్టి కృష్ణా నగరికతపై ప్రసంగాలు ఇప్పించాము. (ఈ విషయాలు చూస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దండకారణ్యంలోకి వచ్చినతరువాతే అస్త్రాలు ఇవ్వడం, అర్జనుడు ఇక్కడ తపస్సు చేసే పాశుపతాన్ని పొందడం బహుశా ఇక్కడమాత్రమే అటువంటి ఆయుధాలు తయారు చేయగల సామర్ధ్యం ఉన్న నాగరికత ఉండడం వల్లనే నేమో అని సరదాకి అనిపిస్తుంది). రామాయణంలో ఇక్కడి నాగరికతకు సంబంధించిన విశేషాలు కొన్ని కనిపిస్తాయి.
నిజానికి తాళ వృక్షానికి ఆపేరు రావడానికి కారణం, తల పొడవు కనుక వచ్చింది. ఇది తాటి చెట్టుకు పేరు. ఇదే తాటి చెట్టులేని ఇతరప్రాంతాలలో కొబ్బరి మొదలైన పొడవుగా ఉండే చట్లకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తాటకి తెలుగింటి ఆడపడచు. దీనికి సిగ్గుపడాల్సిన పనిలేదు. చరిత్రని చరిత్రగా చెప్పుకుంటే రాముణ్ణి ఎదిరించినవారు మనవారని మనం గర్వంగా చెప్పవచ్చు. అంతమాత్రం చేత నాస్తికత్వమని తప్పుపట్టనక్కరలేదు.

ఇంకాస్త మీదకి వెళితే ‘చికున్ గునియా’ పై అమెరిగా పరిశోధకులు, అది ముందుగా కనిపించిన సొమాలియాలో పరిశోధనలు చేశారు. ఆ పదం యొక్క పుట్టుక సొమాలియాభాషలో ఉంది. వారి భాషలో ‘కుంగుంన్యాలా’ అంటే క్రుంగిపోయారు అని అర్థం. ‘చీ కుంగుంన్యాలా’ అంటే బాగా క్రుంగిపోయారు అని అర్థం. ఈ వ్యాధికి ఆ లక్షణం ఉంది కనుక వారు అలా పిలిచేవారు. ఇది మనం తెలుగులో ‘కుంగిపోయాడు’ అన్న మాటకు సారూప్యంగా కనిపిస్తుంది. నెల్లూరు యాసలో ‘కుంగున్యాడు’ అని అనడం కద్దు. దీనిబట్టి ఆఫ్రికాలోనీ తెలుగు భాష ఉన్నదని తెలుస్తుంది. ఒక ఉదాహరణకి ఇలా భావించలేకపోవచ్చు, కానీ ఇలాంటివి నూటయాభై ఇప్పటికే కనుగొన్నారు. వీటిని `Makers of Civilization' అనే పుస్తకంలో L.A. Waddell అనే పరిశోధకుడు పొందుపరిచారు.
అతని తన పరిశోధనలలో సుమేరియా నాగరికతనుండి ఆర్యులు వచ్చారని చెబుతూ బాబిలోనియాలో దొరికిన శిలాశాసనాలలో అనేక రాజవంశీకుల కథలు మన పురాణాలలో ఉన్నాయని వివరించారు. నిజానికి క్షత్రియులు అన్న పదం, బాబిలోనియన్లు ఉపయోగించే ‘KaTiTis’ అనే పదంనుండి వచ్చింది. ఇక ఆ పుస్తకంలో రాముడు, సగరుడు, హరిశ్చంద్రుడు, అసమంజసుడు మొదలైన మన పురాణవ్యక్తుల కథలు కనిపిస్తాయి. సగరుని వాళ్ళు సర్గన్ అని పిలుస్తారు. అతని కుమారుడైన అహమినిస్ కథ, సగరుని కుమారుడైన అసమంజసుని కథ పోలి ఉంటుంది. అట్లే నర్సింగ్ అన్న పదం మనిషి ముఖం సింహం శరీరం కలిగిన ప్రాణికి (ఈజిప్టు స్ఫినిక్స్ దేవత లా) వారికి ఉంది. దీనిబట్టి Sumerians are Aryans అనే విషయం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వచ్చిన నవీన ఆధారాల తో Early Sumerians are Dravidians అని అనవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలుగులోని కడవ, కమరచేయు, కలము (పడవ అనే అర్థంలో), చీరుట, ఇసుక, చిలువ, బూది, దొబ్బు, గూడు, కూన, మగ, చాటు, బెల్లం (చిన్నపిల్లాడి పురుషాంగం అర్థంలో) మొదలైన పదాలు ఇంచుమించు అవే అర్థంలో ఆఫ్రికా భాషలో కనిపిస్తాయి. దీనిబట్టి Bernard Sergent అనే అతను ఆఫ్రికా నైలు నాగరికత నుండి సుమేరియా, ఆపై ఇరాన్ మీదుగా ఒక గుంపు మీదకి రెండవ గుంపు సింధు, కృష్ణా నాగరికతలు గా విస్తరించాయని సూత్రీకరించారు. అయితే తాజా పరిశోధనలో ఇరాను నుండి సముద్రమార్గం ద్వారా నేరుగా డక్కన్ లోకి వచ్చారని, ఋగ్వేదకాలానికే డక్కన నాగరికత విలసిల్లుతూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకి, బాబిలోనియలో ఒక రకం వస్త్రాన్ని సింద్ అనేవారని ఆర్కియాలజిష్టులు అది సింధు నాగరికతనుండి వచ్చింది కాబట్టి ఆపేరు వచ్చిందని నిర్ణయించేశారు. అయితే ఇది సిందురము (రంగు) వస్త్రము కనుక దానికి ఆపేరు వచ్చింది. ఇది బహుశా మన మచిలీ పట్నం ప్రాంతంలో తయారు చేయబడి ఇతరదేశాలకి వెళ్ళింది.

(ప్రసంగానంతరం ప్రశ్నాకార్యక్రమంలో ‘మరి తెలుగు అంత ప్రాచీనమైతే పెళ్ళి మంత్రాలు తెలుగులో కాకుండా సంస్కృతంలోనే ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.)
మధ్యయుగంలో వచ్చిన మార్పుల చేత సంస్కృతం ప్రబలమయ్యింది కానీ నిజానికి అంతకు ముందు ఇక్కడ తెలుగునాగరికత సంస్కృతి ఉండేవి. ఉదాహరణకి తాళి కట్టడం అనేది ముందు లేదు. తాళి అన్నది తెలుగు పదం. ముస్లిం దండయాత్రల కాలంలో పెళ్ళైయ్యిందనేందుకు చిహ్నంగా తాటి ఆకుతో చేసినది ధరిచడం మొదలుపెట్టారు. అందుకే దానికి తాళి అన్నపేరువచ్చింది. ఆ తరువాత అనేక అన్యాయమైన, వెర్రి మార్పులు చేసి స్త్రీ స్తనముల రూపంలోని మంగళసూత్రాన్ని మొదలెట్టారు, పెళ్ళి తంతుని ఏర్పరిచారు. అంతకుముందు ఈ ప్రాంతంలో ఉండే ఆచార వ్యవహారాలు వేరు.

ఈ ప్రసంగానికి స్పందిస్తూ శ్రీ ఉపాధ్యాయుల నరసింహమూర్తి, శాస్త్రీయ ప్రసంగాన్ని కర్కశంగా కాకుండా సరళంగా చెప్పారు. చెప్పిన విషయాలు, వచ్చిన ఫలితాలు నూటికి నూరుపాళ్ళు సరికాకపోవచ్చు అని ఆయనకూడా ఒప్పుకుంటారు. ఇంకా భాషాసంబంధమైన విషయాలలో పరిశోధనలు ఒక కొలిక్కి రాలేదు. అయితే తెలుగువారి ఉనికిని, స్థితిని గుర్తించడానికి వక్త చేస్తున్న కృషి అభినందనీయం. ఈత్రోవలో ఆయన మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నను. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కోవలసింది వ్యాపారప్రాబల్యాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని కాదు సాంస్కృతిక ప్రాబల్యాన్ని. ఇది చాలా కష్టమైన పని. దీనికి ఉదాహరణ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ యొక్క దయనీయస్థితి. తెలుగు భాషకి నిజానికి కార్పరేట్ స్కూళ్ళకంటే, తల్లి దండ్రులే పెద్ద అడ్డంకిగా ఉన్నారు. ఇది తన ప్రత్యక్షంగా చూసిన నిజం అంటూ వక్తని అభినందిస్తూ ముగించారు.
చివరగా వందనసమర్పణ శ్రీ కె. శారదా ప్రసాద్ చేశారు.

26, నవంబర్ 2009, గురువారం

మూడువందల యాభైమూడవ సభ

తెలుగు వెలుగు

అధ్యక్షులు : శ్రీ ఎం. సుధాకర్
(ప్రొ|| శ్రీకృష్ణా బజాజ్, విజయనగరం)
వక్త : డా|| జి. వి. పూర్ణచందు
(తెలుగు భాషోద్యమ ప్రముఖులు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ)
విషయం : తెలుగుభాషా ప్రాచీనత - నూతన పరిశోధనాంశాలు
సమ్మానకర్త : కుమారి అడిదం ఇందిరాంబ
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 29-11-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

మూడువందల యాభైరెండవ సభ

(నలభైరెండవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)

తెలుగు లెంక - శ్రీ తుమ్మల

అధ్యక్షులు : శ్రీ రావి- ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
వక్త : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్
(కార్యదర్శి, విజయభావన)
విషయం : తుమ్మల కవితా వైభవం

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 15-11-2009 ఆదివారం సా|| గం|| 6.00 ని||లకు

గమనిక : వక్త తన ప్రసంగసారాన్ని వ్యాస రూపంలో padyam.net లో పొందుపరిచారు.

19, అక్టోబర్ 2009, సోమవారం

మూడువందల యాభైయ్యొకటవ సభ

నవలా విలాసం

అధ్యక్షులు : శ్రీ అవనాపు సూరిబాబు
(మున్సిపల్ ఛైర్మన్, విజయనగరం)
వక్త : శ్రీ నండూరి రాజగోపాల్
(`చినుకు ' సంపాదకులు, విజయవాడ)
విషయం : ఇప్పటికీ గోపీచంద్ నవలలు అవసరమా!
సమ్మానకర్త : శ్రీ కె. కృష్ణమూర్తి. బి.కాం, బి.ఎల్
(ప్రముఖ న్యాయవాది)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం: తే 25-10-2009 ఆదివారం సా గం 6.30 నిలకు