13, ఆగస్టు 2009, గురువారం

బాలభారతి

మూడువందల నలభైతొమ్మిదవ సభ

బాలభారతి

అధ్యక్షులు : శ్రీ బగ్గాం రామజోగారావు
(విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కలాశాల గజపతినగరం)
వక్త : శ్రీ కిలపర్తి దాలినాయుడు
(ఉపాధ్యాయులు, సాలూరు)
విషయం : విజయనగరం జిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులు
సమ్మానకర్త : శ్రీమతి ఎ. లలితాశంకర్
(సహాయకార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 30-08-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

6, ఆగస్టు 2009, గురువారం

రామకృష్ణుని కవితారామణీయకం

విజయభావన మూడువందల నలభైఎనిమిదవసభ, స్థానిక గురజాడస్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో ఆదివారం సాయిత్రం జరిగింది. రామకృష్ణుని కవితారామణీయకం అనే అంశంపై సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కలాశాల ఆంధ్రోపన్యాసకురాలు డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి గారి ఉపన్యాసం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆ వివరాలు :
ముందుగా డాక్టర్ ఎ. గోపాలరావుగారు సభకు స్వాగతం పలికి, అతిథుల్ని పరిచయం చేశారు. శ్రీమతి వెల్లసరోజిని గారు ప్రార్థన చేశారు. సభకు శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మిగారు అధ్యక్షత వహించారు. ఆమె తన ప్రసంగంలో విజయభావన సంస్థ చేస్తున్న సాహితీ సేవను కొనియాడారు. అనంతరం వక్తను సంస్థ కార్యదర్శి శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాష్ శాలువతో, జ్ఞాపికతో సమ్మానించారు. సమ్మానకర్త శ్రీమతి దేవీప్రకాష్ గారు మాట్లాడుతూ, భక్తి టి.వి లో తులసి కార్యక్రమంలో స్త్రీసూక్తం ద్వారా శ్రీమతి అనంతలక్ష్మిగారు ఎంతోమంది చారిత్రిక, పౌరాణిక స్త్రీ మూర్తులను పరిచయంచేస్తున్నారని కొనియాడారు. భారత భారతి అనే జాతీయసమైక్యతా రూపకాన్ని తయారుచేసి అందులో కలభాషిణి అనే పాత్రను కూడా పోషించారని వక్తను అభినందించారు. అనంతరం శ్రీమతి అనంతలక్ష్మిగారు ప్రసంగించారు. శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్ వందనసమర్పణ చేశారు.

శ్రీమతి అనంతలక్ష్మి గారి ప్రసంగంలోని కొన్ని అంశాలు :

భవిష్యత్తులో ఉపయోగపడేట్లుగా ఉండేదే సాహిత్యము. భవిష్యత్కాలాన్ని అంతర్నేత్రంతో దర్శించగలవాడే కవి, అటువంటివారిలో తెనాలి రామకృష్ణుడు ఒకరు. సార్వకాలికమైన విలువలు కలిగిన సాహిత్యరచనలు చేసిన రామలింగడు తన రచనలలోని విషయాలను శాస్త్రంతో అన్వయించి చూపాడు.

పాండురంగమహాత్మ్యం భావగుంభనమైన కావ్యము. అతని లింగపురాణం, కందర్పకేతు విలాసం గ్రంథాలు లభ్యంకావడంలేదు. అతని హాస్యం సున్నితం, సునిశితం, గంభీరం, ఉదాత్తమైనది.


రాధాకృష్ణుల భక్తుడైన చైతన్య స్వామిని అనుసరించి రాధాకృష్ణుల భజనలు చేస్తూ తిరిగాడు, అందుకనే రాధాదేవి ప్రేమతత్వాన్ని తన పాండురంగ మాహాత్మ్యంలో వ్రాశాడు. రాధాదేవి కృష్ణునికై చేసిన తపస్సు ఫలించుటచే అన్ని ఋతువులలోనూ చెట్లు చిగురించాయి. మనసు మోడై, ఆశలు చిగురించని స్థితికి చేరుకోవడమే నిజమైన తపస్సు. ఆవిధంగా తపస్సు చేసిన పార్వతి 'అపర్ణ' అయ్యింది. అదేవిధంగా తపస్సు చేసిన రాధ కృష్ణునిలో ఐక్యం అయ్యింది.
అతని కావ్యంలోని ఋతు వర్ణన అతని ప్రౌఢతను చాటి చెబుతుంది, కాళిదాసు తో సమానంగా పదబంధాలు వాడారు. సంస్కృతంలో మహాకవి కాళిదాసు పుంభావ సరస్వతి అయితే, తెలుగులో తెనాలి రామకృష్ణుడు పుంభావ సరస్వతి. అతని కున్న వికటకవి బిరుదు పరిహాసం కాదు అందమైనదని, సరళమైనది.

అతని ఇంటి పేరు గారపాటి వారు. తెనాలిలో స్థిరపడడం వల్ల తెనాలి ఇంటి పేరుగా మారింది.
చైతన్య మహాప్రభు భక్తి తత్వ ప్రభావం వల్ల తెలుగులో విఠలాగమం అనే గ్రంథాన్ని పరిచయం చేశాడు, దురాచారాలను ఖండించాడు.
వైష్ణవులు, శైవులు, శాక్తేయులు ఒకటేనని, భక్తి జ్ఞాన కర్మ యోగాలు మూడింటిని తన ఉద్భటారాధ్య చరిత్ర లో చక్కగా విపులీకరించాడు. మంత్ర హఠ రాజయోగాలను వివరించిన తీరు ప్రశంసనీయం.
అతను స్త్రీ పాత్రలను చాలా ఉదాత్తంగా చిత్రించాడు, స్త్రీలను చులకనగా చూస్తే ఏమి జరుగుతుందో చెప్పాడు. నిగమశర్మ అక్క చాతుర్యాన్ని, అతని భార్య సౌశీల్యాన్ని చక్కగా తెలిపాడు. పడు పడుకకు తెలియకుండ నిగమశర్మ ఇల్లు దోచుకొని పోయినప్పుడు, నిగమశర్మ అక్క తన ముక్కెర పోయినందుకే దుఃఖించినట్లుగా చెప్పడం, రామకృష్ణుని హాస్యచతురతకు నిదర్శనంగా చెబుతారు. అయితే అది సరికాదు. ఆమె తన ఐదవతనానికి ఒక చిహ్నమైన ఆభరణాన్ని తీసుకు వెళ్ళినందుకు విచారించింది. ఒక సంప్రదాయానికి విఘాతం కలిగినందుకు బాధపడింది.

తెనాలి రామకృష్ణుడు భారతీయ సమాజంలో, స్త్రీలకు ఉన్న ఉన్నత స్థానం గురించి తెలియజేశాడని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.