1, జులై 2010, గురువారం

పురస్కృతమూర్తి స్తుతి - 8




ఎవరు? మరెవరు? ఇంకెవరు?!

మధుర మంజుల మనోజ్ఞ రసజ్ఞమూర్తి
పావన నవజీవన కవితావనదీప్తి
సుందర సురభిళ భావకవితారసస్ఫూర్తి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

తన ‘వజ్రాయుధాన్ని’ ఝళిపించి
తానేంటో నిరూపించిన
కవితా విపంచి
ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

అమృతతరంగిణి ఆ వీణాపాణి
దరహాస వాణిగా వీరి
‘మేఘరంజని’ ‘అక్షయతరంగిణి’ భాసిస్తే
పలుకుల చెలి కాలి నూపురంలా
‘రక్తాక్షి’ ‘కాహళి’ ప్రకాశిస్తే
మధురమోహన మురళీరవళిలా
వీరి ‘కళాకేళి’ సంపాదకత్వం
పాఠకహృదయాంతరాళలలో ప్రతిద్వనిస్తే

ఎవరు? మరెవరు? ఇంకెవరు?!
వారే అవంత్స సోమసుందర్!

వీరి కవిత
సాహితీభారతి నొసట తిలకం
వీరు సాహితీలోకానికి తలమానికం!
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి - 7



బహుముఖ ప్రతిభామతి - వాసా ప్రభావతి


స్వాతంత్ర్య బీజాలు జన్మచే మొలకెత్త
పెద్ద చైన్నులుగారి ముద్దుగుమ్మ
శాస్త్రిని చేపట్టి చదువులరాణివై
గుట్టుగాకూసిన కోయిలమ్మ
తెలుగు నారుల పోరు తేజమ్మునందంగ
కలముబట్టిన వీర కైతలమ్మ
గృహలక్ష్మి కంకణగేహినివైవెల్గి
వాసిగాంచినయో ప్రభావతమ్మ

గుండెలోని ప్రేమ గొంతులోనికి పొంగ
పలుకరించునట్టి పడతివమ్మ
వార్షికోత్సవాన వాసంత రాగాల
నాలపించినట్టి యతిథివమ్మ!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన :శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -6




వెలెస నండూరి వంశంబున వినుతికెక్క
రామకృష్ణమాచార్యుడు రమ్యమూర్తి
తెలుగుతల్లికి పుట్టిన వెలుగునీవు
తెలుగు సాహితీ జగతి తేజమయ్యె

మృదువైన భాషసంపద
ముదముగ పద్యాలు గూర్చు మురిపెముతోడన్
పదములు భావంబుధులే
చదువరులకు పంచిపెట్టె చక్కని కావ్యాల్

తెలుగు గడ్డమీద తనరంగనీకీర్తి
పద్యమందు మధువు పల్లవించె
భావపటిమ గల్గి భాసిల్లె పద్యంబు
రమ్యచరిత నీది రామకృష్ణ!
(రచన : శ్రీ భైరవభట్ల శివరామ్ )

పురస్కృతమూర్తి స్తుతి - 5




ఆనాటి కవిత్వమ్మును
కాణాచిగ నందిన ‘సురగాలి తిమోతి
జ్ఞానానందకవీశ్వర!
ఆనందమె నీ కవిత్వమందరి కొసగున్

విజయనగరజిలా వీరబొబ్బిలిదరి
పెదపెంకిలో పుట్టి ప్రియముగూర్చె
ప్రాచీన కవితనారాధించు కవిరాజు
ఖండకావ్యాల ప్రఖ్యాతకవియె
సంప్రదాయ కవిత్వ సారమ్ము గైకొని
పద్యకవితలు వ్రాసె హృద్యముగనె
‘ ఊ’ కూని రాగాల నుత్కృష్ట పద్యముల్
చక్కాగా చదువు' మీసాలె' కవియె

ఆమ్రపాళి మరియు నన్ని కావ్యమ్ములు
మణులు మరకతాలె ; మన ప్రభుత్వ
మందుచేత నిచ్చెనంత పద్మశ్రీ ని
కవిని గారవించె ప్రవిమలముగ!
(రచన : శ్రీ తూటబాబాజీ )

పురస్కృతమూర్తి స్తుతి - 4




చిన్నారిగేయాల జేజిమామయ్యయై
బాలాంతరంగపు బాలుడితడు
రాధ విరహగీతి మాధవునెద జల్లు
కవితామయ రజనీ కాంతుడితడు
సంగీత సాహిత్య సమ్మేళనమ్ముతో
సామవేదమ్ముల సారమితడు
ఆకాశవాణిలో అలలుగా సాగిన
లలితసంగీతాల లాస్యమితడు

తేనె లొలికించు తీయని తెలుగుపాట
హాయికలిగించు వినినంత నతని నోట
‘ రాధ కూతురు వా ’ యంచు రమ్మటంచు
పాత సంగతి తలపోసి పలుకరించె!

విజయపథమునందు విజయభావన సాగి
పాతికేండ్ల తలపు పంచుకొనగ
వెండి పండగందు వెలుగొందు విజ్ఞులు
అందుకొనుడు వంద వందనాలు!
(రచన : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశమ్మ)

పురస్కృతమూర్తి స్తుతి -3




కవితలకు కైమోడ్పు
ఏ కవితలకు ?
సుకవితలకు ?
ఎవరు సుకవి?

‘ కవితకోసమె నేను పుట్టాను
క్రాంతికోసమె కలం పట్టాను ’
అని తన పదముద్రలను
సాహితీప్రియుల ఎదలలో భద్రపరచుకున్న
నవవచో భద్రునకు
కవితా సముద్రునకు
‘ఆరుద్రు’నకు నా కై మోడ్పు

ఏకవితలకు ? సుకవితలకు !
ఎవరు సుకవి?

‘ సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర
అక్షరాలే అతని వేలుముద్ర వ్రాలుముద్ర ’
అని ముళ్ళపూడిచే కొనియాడబడ్డ
ఆ విశద యశస్వి, సుమనస్వి, కవితాతపస్వి
ఆరుద్రునకు నా కైమోడ్పులు

ఏకవితలకు? సుకవితలకు!
ఎవరు సుకవి?

తన సర్వస్వాన్ని ధారపోసి
‘ విజ్ఞాన సర్వస్వాన్ని’ లోకానికందించిన కవితావారాశి
‘ పలకలవెండిగ్లాసు’ లాంటి అపరాధపరిశోధక
నవలలందించిన నవనవోన్మేష నవలాకారుడు
‘ త్వమేవాహం’ అన్న కవికులైక భూషణుడు
‘సినీవాలి’ ని అందంగా ఆవిష్కరించిన
పలుకులచెలి గారాలపట్టి
వేలపాటలు , వేవేల కవితలు వ్రాసిన
ఆరుద్రుని కవితలకు నా కైమోడ్పులు
( రచన : శ్రీ శారదాప్రసాద్ )

పురస్కృతమూర్తి స్తుతి -2




జంధ్యాల పాపయ్యశాస్త్రి సత్కవిరాచు
కలము చక్కెరముంచి కవిత వ్రాసె
మధుర పదమ్ముల మధురాతి మధురమౌ
భావములొలికించె పద్యమల్లె
అనుప్రాసములు వాడి ఆనంద డోలికల్
నూగించె పాఠకునున్నతముగ
ఖండకావ్యమ్ములు కలకండ ఖండాలె
ఘంటసాల మధురకంఠ సీమ

పువ్వులేడుపు, కర్ణుని పుట్టు కతలు
బుద్ధభగవాను జీవన పుణ్యకథలు
వీరభారత విజయువిహారకథలు
తీపి పిల్లల శతకమ్ము ‘తెలుగుబాల’

కరుణశ్రీ బిరుదమ్ము నీకెతగు నీ కావ్యమ్ములే చాటు, ప
ల్మరు కావ్యమ్ముల ఖండికల్ హృదయమున్ మాధుర్యమున్ దేల్చు, సు
స్థిర సాహిత్యమె సౌరభాల ‘ఉదయశ్రీ’ కావ్య సత్ఖండికల్
సిరి, గీతామృత మాధురిచ్చు ‘విజయశ్రీ’ భారతాఖ్యానమున్
(రచన : శ్రీ తూటబాబాజీ )

పురస్కృతమూర్తి స్తుతి -1




శ్రీ మధునాపంతుల ఘన
శ్రీ మహిమాన్విత కవిత్వ సిద్ధుడవగుచున్
ధామంబైవెలుగొందుచు
మా మానసమందు నిల్చె మహనీయముగాన్

ఆదితాంబూలమిచ్చుచు ఆదరించె
భాసురంబుగను విజయభావనందు
భవ్యవైతాళికుండవు భాషయందు
తేనెలొలికెడి తెలుగులో తేటమవగ

ఆంధ్రపురాణకృతియె అద్భుతంగు
ఆంధ్రకీర్తిని చాటెను అన్నిదెశల
హర్షవర్షంబు కురిసెను ఆంధ్రయంత
అట్టి సుకవికి నేనును అంజలిడుదు!
(రచన : శ్రీ భైరవభట్ల శివరామ్ )

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మూడువందల అరవైయ్యవ సభ

కవితాచమత్కృతి

అధ్యక్షులు : శ్రీ మేకా కాశీవిశ్వేశ్వరుడు
(మున్సిపల్ కౌన్సిలర్, డైరక్టర్: సిటీ కేబుల్, విజయనగరం)
వక్త : డా || యస్. టి. పి. శ్రీనివాసాచార్యులు
(ప్రథమ శ్రేణి తెలుగు పండితులు, కొండకర్ల )
విషయం : దక్షిణాంధ్ర యుగ ప్రబంధాలు - చమత్కారాలు
సమ్మానకర్త : సహజకవి శ్రీ తూట బాబాజీ
(కార్యవర్గ సభ్యులు, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 25-04-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

10, మార్చి 2010, బుధవారం

మూడువందల యాభైయ్యెనిమిదవ, మూడువందలయాభైతొమ్మిదవ సభలు

ఇరవై అయిదవ వార్షికోత్సవము - రజతోత్సవవము
శ్రీవికృతి ఉగాది

ప్రకృతి - ప్రగతి

అధ్యక్షులు : శ్రీ రావి. ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
జ్యోతిప్రకాశనం : శ్రీ సిహెచ్. అప్పలరాజు,
(ప్రొ|| సాయిబాబా పవర్‍ప్రస్)
ఫోటో ఎగ్జిబిషన్ : విజయనగర్ ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్
ప్రెసిడెంట్ : వి. ఆర్. రామునాయుడు; సెక్రటరీ : వి. రాజశేఖర్
ప్రారంభకులు : Rt శ్రీ. జి. శివకుమార్
(మేనేజింగ్ డైరెక్టర్, ఎస్. వి. ఎన్. లేక్ పేలస్)
ముఖ్య అతిథి : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ప్రముఖ సంపాదకులు, హైదరాబాద్)
ప్రత్యేక అతిథి : డా|| యు. ఎ. నరసింహమూర్తి(ప్రఖ్యాత సాహితీమూర్తి) గారికి
విజయభావన సమ్మానం
సంపూర్ణ శతావధాన గ్రంథావిష్కరణ
జ్ఞాపికలప్రదాత : డా|| వై. బాబూరావు
(ప్రొప్రయిటర్, హోటల్ మయూర)

పురస్కృతమూర్తి స్తుతి

అధ్యక్షులు : శ్రీ బులుసు జి ప్రకాష్
(ఉపాధ్యక్షులు, విజయభావన)
సమన్వయకర్త : డా|| ఎ. గోపాలరావు
(ప్రధాన కార్యదర్శి, విజయభావన)
జ్ఞాపికల ప్రదాత : శ్రీ ధవళ సర్వేశ్వరరావు
(అధ్యక్షులు, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్)

కుమారి నడిమింటి విజయలక్ష్మి : ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, శారదా అశోక్ వర్థన్
శ్రీ బిహెచ్. శివరామ్ : మధునాపంతుల, నండూరి
శ్రీ తూట బాబాజీ : కరుణశ్రీ, ఎస్ టి. జ్ఞానానంద కవి
డా|| జక్కు రామకృష్ణ : మిక్కిలినేని, గొల్లపూడి
శ్రీమతి బిహెచ్. దేవీప్రకాశమ్మ : రజనీకాంతరావు, వాసా ప్రభావతి
శ్రీమతి పి. ఈశ్వరీమోహన్ : నాయని కృష్ణకుమారి, జి. వి . సుబ్రహ్మణ్యం
శ్రీ బిహెచ్. బాబూజీ : మాలతీ చందూర్, ద్వివేదుల విశాలాక్షి
శ్రీ బిహెచ్. నరసింహం : కొత్తపల్లి వీరభద్రరావు, పాలంకి
శ్రీ పి. శిరీషా రఘునాథశర్మ : ఉత్పల సత్యనారాయణ, శలాక రఘునాథ శర్మ
శ్రీ కె. శారదాప్రసాద్ : ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్
శ్రీమతి ఎ. లలితాశంకర్ : భ.రా.గో., రావూరి భరద్వాజ
కుమారి అడిదం ఇందిరాంబ : బోయిభీమన్న, ఆచార్య ఎన్. గోపి

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం ఉద|| 9.30 గం||


చైత్రప్రభ

అధ్యక్షులు : సేవాశిరోమణి శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎం.ఎల్.ఎ
(అధ్యక్షులు, శ్రీ సాయి ఫౌండేషన్; ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, విజయనగరం)

పురస్కారగ్రహీత : డా|| పొత్తూరి వేంకటేశ్వరరావు
(ఆం.ప్ర. ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు)
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
(పురపాలక సంఘాధ్యక్షులు, విజయనగరం)

జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. వి. ఎస్. కె. ప్రసాద్
(హిమాంశు బుక్ డిపో)
విద్యార్థులకు, కళాకారులకు జ్ఞాపికల ప్రదాత : శ్రీ కె. కృష్ణమూర్తి
(ప్రముఖ న్యాయవాది)(కీ||శే|| కూరెళ్ళ వేంకటశాస్త్రి అండ్
మనోరమ మొమోరియల్ ట్రస్టు)

రాష్ట్రస్థాయి ఉత్తమ శతకసాహిత్య వ్యాస స్పర్థ విజేత : శ్రీ ద్వాదశి సుబ్రహ్మణ్యప్రభాకరరావు, తెలుగుపండిట్, కాకినాడ

బహుమతి ప్రదాత : శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
(గౌరవాధ్యక్షులు, విజయభావన)

సాంస్కృతిక కార్యక్రమాలు (సభాప్రారంభంలో)
నృత్య ప్రదర్శనలు : నిర్వహణ - నర్తనశాల , డి. రాధికారాణి
మిమిక్రీ : దాదా (నెల్లిమర్ల)
మేజిక్ : సలీమ్ (విజయనగరం)



వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం

సమయం : 16-03-2010 మంగళవారం సా|| 6.00 గం||

18, ఫిబ్రవరి 2010, గురువారం

మూడువందల యాభైయ్యేడవ సభ

శంకరవాణి

అధ్యక్షులు : శ్రీ గురాన సాధూరావు
(ప్రముఖ సమాజసేవకులు, విజయనగరం)
వక్త : శ్రీ సర్వాజోశ్యుల గౌరీశంకరశాస్త్రి
(తెలుగు పండితులు, రాజుల తాళ్ళవలస )
విషయం : శివానందలహరి
సమ్మానకర్త : శ్రీ భైరవభట్ల నరసింహం
(కోశాధికారి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 28-02-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

17, ఫిబ్రవరి 2010, బుధవారం

వసుచరిత్రవైచిత్రి

సభకు ఆహ్వానం డా|| జక్కు రామకృష్ణగారు పలుకుతూ, అధ్యక్షులైన ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. రాజు గారిని, ఆయన శ్రీ సాగిశివసీతారామరాజు కళాపీఠంచే చేస్తున్న సేవను, ఇతర సంస్థలకు అందిస్తున్న సహాయాన్ని, ముఖ్యంగా పుస్తక ప్రచారానికి ఆయన చేస్తున్న కృషిని శ్లాఘించారు. వక్త శ్రీ కోటారావుగారిని ఆహ్వానిస్తూ, కవిగా, విమర్శకునిగా కృషిని కొనియాడుతూ మేలి జాతిరత్నంగా అభివర్ణించారు. ఆశుపద్య రచనలో ఆయన ప్రతిభ ద్వారా, భువనవిజయం లో తిమ్మరసుగా, ఆయన సుపరిచితులని గుర్తుచేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ గారిని ఆహ్వానిస్తూ, స్వర్గీయ మోహన్ గారి దీప్తిని కొనసాగిస్తున్న ఆమె కృషిని అభినందించారు. అనంతరం శ్రీ కాగుపాటి నారాయణరావు గారు ప్రార్థన చేశారు. అధ్యక్షులు శ్రీ రాజు గారు మాట్లాడుతూ విజయభావన తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. విజయభావనను సాహిత్యానికి యూనివర్సిటీగా పేర్కొన్నారు. సాహిత్యం ద్వారా విలువలు పెరుగుతాయన్నారు. అందుకే పుస్తకపఠనాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీకుకువెళ్ళాలని పిలుపునిచ్చారు. పుస్తక ప్రచురణ, ప్రదర్శన కొరకై తమ సంస్థ చేస్తున్న పనులను వివరించారు. పుస్తకాలను మరింత విస్తృతంగా వ్యాప్తి చేయడానికి చేయవలసిన సూచనలు చేశారు. తమకు పుస్తకాలను సగం ధరకు అమ్మినవాళ్ళకు, తమదగ్గర సగం ధర ఇచ్చి కొన్న వాళ్ళకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మానకర్త శ్రీమతి ఈశ్వరీమోహన్ మాట్లాడుతూ భాషాపరిజ్ఞానానికి ప్రబంధ పఠనం అవసరం అని, రామరాజ భూషణుని వసుచరిత్ర అత్యుత్తమమైన రచన అని తెలిపారు. అనంతరం శ్రీ కోటారావుగారిని సమ్మానించారు. సమ్మానంతరం ‘వసుచరిత్ర వైచిత్రి’ పై శ్రీ కోటారావుగారు ప్రసంగిస్తూ, విజయనగరంలో తను చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ తనకు కనువిప్పు ఇక్కడే కలిగిందిఅని చమత్కరించారు. విజయభావనలో మాట్లాడితే ఒక తృప్తి ఉంటుంది అని, ఎప్పుడు ఆదేశించినా వస్తానని తెలిపారు. శ్రీ శారదా ప్రసాద్ గారు వందన సమర్పణ చేశారు.
ప్రసంగ సారాన్ని పద్యం.నెట్ లో పొందుపరుచుట జరిగింది.

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శతావధానం - పద్యాలు

విజయభావన ఆధ్వర్యంలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి శతావధాన కార్యక్రమం ఈ డిసంబరు 25-27 తారీఖులలో దిగ్విజయంగా నిర్వహింపబడినది. అందులోని అంశాలను, పూరించిన పద్యాలను పద్యం.నెట్ లో చూడండి.

15, జనవరి 2010, శుక్రవారం

మూడువందల యాభైయ్యారవ సభ

వసుచరిత్ర వైచిత్రి

అధ్యక్షులు : శ్రీ ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. ఆర్. ఎమ్. రాజు
(ప్రముఖ న్యాయవాది, వ్యవస్థాపకులు సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం, విజయనగరం)
వక్త : శ్రీ కె. కోటారావు, భాషాప్రవీణ, విద్యాప్రవీణ, ఎం.ఎ
(ఆంధ్రపద్య కవితా సదస్సు విశాఖ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి )
విషయం : రామరాజ భూషణుని కవితా రామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి పి. ఈశ్వరీమోహన్
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 31-01-2010 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు