29, సెప్టెంబర్ 2009, మంగళవారం

హైకూ అందాలు

‘రెండు రెక్కలు
నింగిలో స్వప్నలిపి
హైకూ విహంగం !’
- పెన్నా శివరామకృష్ణ

విజయభావన మూడువందల యాభైయ్యవ సభకు ఆహ్వానం పలుకుతూ నగరంలో ఉత్సవ వైభవం అందగిస్తున్న సమయంలో విజయభావన విజయోత్సవం జరగడం ఆనందదాయకంగా ఉందని, వచ్చినవారందరికీ దసరా సుభాకాంక్షలు తెలియజేశారు. సభాధ్యక్షులు శ్రీ ఎన్. ఆర్. శ్రీనివాసరావుగారిని పరిచయం చేస్తూ, ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య సేవను కొనియాడారు. కానుకుర్తి నరసింగరావు ట్రస్టు ద్వారా ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. సమ్మానకర్త శ్రీ రావి. ఎన్. అవధాని గారిని పరిచయం చేస్తూ, కథ, నవల, నాటక రచయితగా ఆయన సుపరిచితులని, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆయన విజయభావన అధ్యక్షులుగా ఉండడం విజయభావనకు గర్వకారణం అని కీర్తించారు. వక్త శ్రీ రెంటాల వేంకటేశ్వర రావుగారిని పరిచయంచేస్తూ, సాహితీ విమర్శకులలో ఆయనది విశిష్టస్థానం అని, ఆయన హాస్య రచనలు, అవగాహన అనే వ్యాస సంకలనం పాఠకుల ప్రశంసలు పొందాయని తెలిపారు. ఆయన గజల్స్ పాడటంలో కూడా ప్రావీణ్యం ఉందని, తమ మొదటి పరిచయం దాని ద్వారానే జరిగిందని గుర్తుచేసుకున్నారు.
అనంతరం శ్రీమతి వెల్ల సరోజినిగారు ప్రార్థన చేశారు.
సభాధ్యక్షులవారు మాట్లాడుతూ, విజయభావనలోని మిత్రుల ప్రోద్బలమే తనను అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టినదని తెలిపారు. ఆచార్య భావన్ గారు నాటిన విత్తనం పెరిగి వృక్షమై నేటికి ఫలాలను అందిస్తోందని విజయభావన సంస్థను కొనియాడారు. సభ్యులు ఎంతో కష్టనష్టాలకోర్చి సంస్థను నడుపుతున్నారని, వారికి అందరూ సహాయ సహకారాలందించాలని, మరింత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. భాషాదురభిమానానికి పోకుండా భాష, సంస్కృతి అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. సంస్థకు తన సహాయం ఎల్లెప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
సమ్మానకర్త మాట్లాడుతూ విజయభావన రజతోత్సవ సందర్భంగా ప్రత్యేక సంచిక రాబోతోందని, దానికి సహాయ సహకారాలందించాలని కోరారు.
సన్మానానంతరం వక్త శ్రీ రెంటాల వేంకటేశ్వరరావుగారి ప్రసంగించారు. అందులో కొన్ని వివరాలు : హైకూ అంత అపార్థానికి గురియైన కవితా ప్రక్రియ ఇంకొకటిలేదు. విమర్శకుల వ్యాసాలు, కవుల పుస్తకాలు చదివిన మీదట ఈ అభిప్రాయానికి వచ్చానన్నారు. హైకూ మీద మాట్లాడాలని అనుకోవడానికి ప్రధాన కారణంగా దీనిని చెప్పారు.
హైకూ తెలుగులో కొద్దిగానైనా నిలదొక్కుకోవడానికి కారణం శ్రీ ఇస్మైల్ గారని ఆయనని గుర్తు చేసుకున్నారు. హైకూకి ప్రాధాన్యమనవి మౌనం, ఏకాంతం, ధ్యానం, నిశ్శబ్దం అని వివరించారు. నిజానికి దానిగురించి మాట్లాడడం అంటే దానిని కలుషితం చేయడమే అని ఒక సంఘటనని తెలిపారు. ఒక సాహిత్య సభలో హైకూ మీద ప్రసంగం ఉంది రమ్మని ఇస్మైల్‍గారిని ఆహ్వానించగా ఆయన జవాబుగా ‘మనం ఒక గంట కలిసి మౌనంగా కూర్చుందాం!’ అని పంపారు. హైకూ అనేది జపాన్ దేశంలో జన్మించిందని, జెన్ బౌద్ధమతం యొక్క ప్రభావం దీనిపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. ధ్యానం అన్న పదం రూపాంతరం చెంది జెన్ అయ్యిందని దీనికి హైకూకీ చాలా లోతైన సంబంధం ఉందన్నారు. హైకూ మూడు పంక్తుల కవితారూపమని, పదిహేడు అక్షరాలు కలిగి ఉంటుందని చెప్పారు. బౌద్ధల నమ్మకం ప్రకారం ఒక అనుభూతి పదిహేడు క్షణాల కన్నా ఎక్కువ ఉండదని అందువల్ల హైకూ పదిహేడు అక్షరాలకు ( 5,7,5 ) పరిమితం చేశారని అన్నారు. అయితే జపనీస్‍లో ఏకాక్షర పదాలు ఎక్కువ కనుక అది సాధ్యమని తెలుగులో ఇది చాలా కష్టమని కేవలం క్రొద్దిమంది మాత్రమే చేశారని, మిగిలినవారు ఆది పాటించటంలేదని తెలిపారు. ఆంగ్లంలో కూడా దీనిని సాధారణంగా పాటించరని తెలుపుతూ ఆంగ్లంలో హైకూ పై ప్రత్యేకమైన పుస్తకాలు, క్లబ్బులు కూడా ఉన్నాయని, తెలుగులో దీనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వటంలేదని పేర్కొన్నారు. ఇదొక విదేశీ ప్రక్రియగా చూసి వ్యతిరేకించకూడదని అన్నారు. నిజానికి హైకూ రూప ప్రధానమైనది కాదని, సార ప్రధానమైనదని ఆటవెలది, తేటగీతి వంటివి రూపప్రధానమైనవని, వాటికి ఏభావనైనా తీసుకోవచ్చని, హైకూకి అది కుదరదని తెలిపారు. మనం ప్రపంచాన్ని, ప్రాధమిక, ద్వితీయ అనే రెండిటి క్రింద భావించవచ్చు. ద్వితీయ ప్రపంచంలో మానవుడు తాను నిర్మించుకున్న వ్యవస్థ, నాగరికత, ఆర్థిక,సామాజిక, విద్య, పాలన, యంత్ర మొ|| వాటి జ్ఞానం తో నిండింది. ప్రస్తుతం దీని పై దృష్టే ఎక్కువగా ఉంది.
ఇక మొదటిది ప్రాథమికమైనది ఐన ప్రపంచం లో ప్రకృతి, వాతావరణ స్థితి, జీవన వ్యవస్థ మొ|| వి ఉన్నవి. హైకూ ఈ ప్రపంచానికి చెందినది. ద్వితీయ ప్రపంచ దృష్టితో హైకూని చూడటం కానీ, హైకూని వ్రాయటం కాని సరియైన పద్ధతి కాదు. దీనికి ఉదాహరణగా, ప్రత్యేకమైన త్రీ.డి కార్డ్స్ ను చెప్పారు. ఆ కార్డుని మామూలుగా చూస్తే గజిబిజి గా కనిపిస్తుంది. కనులకు కొంచం దూరంలో పెట్టి ఏకాగ్రతతో చూస్తే కొంత సేపటికి అందులో దాగిన చిత్రాలు కనిపిస్తాయి. హైకూని కూడా అలాగే చూడాలని సూచించారు.
హైకూ లో సామాజిక స్పృహ లేదని, అవి పలాయనవాదుల కవిత్వం అని విమర్శ ఉందని, ఇది కూడా సరియైన దృక్కోణంకాదని అన్నారు. మానుషుల మనసుల్లో, డార్విన్, మార్క్స్ సిద్ధాంతాలు, భావనలు బాగానాటుకు పోయాయని, తద్వారా పోరాటమే జీవనమని, పోరాటాన్ని సమర్థించనివాడు పలాయనవాది అన్న అపోహ కలుగుతోందని అదే హైకూ మీద అపప్రదకు కారణం అని అన్నారు. నిజానికి హైకూ ద్వారా విశ్వ సమన్వయాన్ని, ప్రేమని, అంతర్లీన సూత్రాన్ని చూపించవచ్చని తెలిపారు. హైకూ జీవించడానికి కావలిసిన పరిస్థితుల గూర్చి చెప్పదని, జీవించడం ఎలాగో నేర్పే కవిత్వం అని అన్నారు.
ఉదాహరణగా పర్యావరణ పరిరక్షణకై చేసే ఉద్యమాలు, వ్రాసే కవిత్వం వెనుకాల మనిషి స్వార్థం దాగి ఉందని అయితే హైకూలో కేవలం ప్రాకృతిక స్పృహ కనిపిస్తుందని ఒక హైకూని ఉదహరించారు.
‘అదో పిచ్చి మొక్క
అనబోయి
నా గురించి తనేమనుకుంటోందో!!’
ప్రతీ వస్తువుకూ స్వంత అస్థిత్వం ఉంటుందని హైకూ చూపిస్తుందన్నారు.

‘ఎవరూ తెలియని
మరో ఊరు
నాకునేనే క్రొత్తగా !!’
- మనిషి అనుభవానికి అక్షరరూపంగా ఉదహరించిన హైకూ.


‘గుడి మంటపం
పడుకుని బికారి
ఎంత స్వేచ్ఛ !’
- స్వేచ్ఛను సరళంగా సూచించే హైకూ.

‘అతిథిగా జీవితం
బాగుంది
ఇంటికెళ్ళి దీనిని సాధన చెయ్యాలి!’
- తామరాకు మీద నీటి బొట్టు తత్వాన్ని సూచించే హైకూ.

‘ఆహారం
కృతజ్ఞతతో తీసుకుంటే
మనసుకూడా నిండింది!’
- ఆహారాన్ని ఆస్వాదిస్తూ, తనలో భాగమై తనను శక్తివంతుని చేస్తున్నందుకు కృతజ్ఞత చూపాలని తెలిపేహైకూ.

‘దూరం నుంచి
ఓ అమ్మాయి సమీపించి
క్రమంగా దూరంలోకి అదృశ్యమైపోయింది!’
- స్థిమితమైన స్థితిని చూపిస్తోంది. దృశ్యంలో తాను ఉన్నా దానికి అతీతమైన స్థితిలోకి వెళ్ళడం.

‘జ్వరంతో మంచం మీద
ఎంత విముక్తి
వేటి వేటి నుంచో!’
- ఒక నిశ్చింత, ఆదుర్దా, కంగారులేని స్థితి. చేయగలిగేది తన చేతులో లేదు అన్న భావన ఇచ్చే ప్రశాంతత.

‘ధాన్య రాశుల కాపలాదారు
గింజలేరుకుంటున్న
పిచుకను చూస్తున్నాడు!’
- ఒక దృశ్యాన్ని, కాపలాదారు మనసుని చూపిస్తుంది

‘గుడి
పక్షులు, పిల్లలు దేవుడు
ఒంటరి పూజారి!’
- సహజజ్ఞానానికి ప్రతీకలైన పక్షులు, పిల్లలు. తానే సహజ జ్ఞానమైన దేవుడు, తర్క స్థాయిలో ఉన్న పూజారిని సూచిస్తుంది.

వీటిని వివరిస్తూ, హైకూ ని తెలియాలంటే కవి ఎంత కవో, పాఠకుడు కూడా అంత కవి అవ్వాలని అన్నారు.
ముఖ్యంగా హైకూలో కనిపించేవి, మిగతా ప్రక్రియలలో అంతగా కనపడనివి మూడు ఉన్నాయని అన్నారు. అవి సతోరీ, అవారే, మియాది అనేవి. వాటిని వివరిస్తూ మరికొన్ని హైకూలు ఉదహరించారు.
సతోరీ - మామూలు జ్ఞానానికి అతీతమైన స్ఫురణ. ఇక్కడ బుద్ధికి కాక కేవలం హృదయానికే ప్రాధాన్యం ఉంటుంది.

‘దూరంగా దీపం
దానిని కాపాడుతూ
చుట్టూ చీకటి!’

‘అనాథ బాలిక
జాలి దానం చేసి
వెళ్ళిపోతోంది!’

‘నాతో చదివింది
ఆ అమ్మాయి
పెద్దవాళ్ళమైపోయాం!’

‘పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో!’

‘పసివాడితో వస్తే
పాతబజారే
ఎంత కొత్తగా ఉంది!’

అవారే - ఒకరకమైన దిగులుని సూచిస్తుంది. వస్తువలపై ప్రేమ, నశ్వరమైన జీవితం మొదలైన విషయాలు కనిపిస్తాయి.

‘వేసవి మధ్యాహ్నం
వృద్ధ యాచకురాలు
ఇవాళ రాలేదు!’

‘వంతన వేశారు
కాలువ ఒక గట్టున
ఊగుతూ బల్లకట్టు!’

‘ఒంటరిగా రోదిస్తూ
అతనెవరో
ఓదార్చనా వద్దా!’

‘తోటలో
రాలిన పూవుకు తెలియదు
తెల్లవారిందని!’

‘కూలిన గోడమీద
రాబందు
నిశ్శబ్దం బరువెక్కింది!’

మియాది - సున్నితమైన అనుభూతిని పట్టుకోవడం

‘చలి రాత్రి
తల్లి బిడ్డల్ని
చూస్తేనే వెచ్చదనం!’

‘రాలిన చినుకు
ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో!’

‘నెలలపాపతో
తల్లి కబుర్లు
దీనిని మించిన ప్రేమకావ్యం రాలేదు!’

‘మళ్ళీ గుమ్మంలో
అమాయకంగా
మేం వదిలివచ్చిన పిల్లి!’

‘బస్సు దిగి
బల్లకట్టెక్కాక
కాలానికి కుదురొచ్చింది!’

కొన్ని సరదా హైకూలను కూడా వినిపించారు.

‘కంటి కొసకి మాత్రమే
కనిపించేవి
ఎలక!’

‘సరదాగా కొలిచా
ఇంటికీ బడికీ దూరం
బడే దూరం!’

‘బాల్చీలో చంద్రుడు
మోసుకుపోయి
ఇంట్లో దాచేసుకోనా!’

‘పిల్ల శాస్త్రజ్ఞుడు
భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టాడు
గిర్రున తిరిగుతూ!’

‘ మేకపిల్ల
నా ఇంటి తలుపు తట్టి
నువ్వెవ్వరని చూసింది!’

‘బొమ్మ గీస్తానంటూ
పసివాడు
ఒక గొప్ప చిత్రంలో కూర్చున్నాడు!’

‘బుద్ధుని ప్రతిమ
చెక్కినప్పుడైనా
శబ్దం వచ్చిందా?!’

‘పాపాయి
యాచకునికి
చేతులందిస్తోంది నవ్వుతూ!’

ఇక ప్రతీ సాహిత్య ప్రక్రియకూ ఉండే అన్ని ప్రయోజనాలు హైకూవల్ల కూడా సాధ్యమని. అంతకు మించిన మానసిక ప్రశాంతత దీనిద్వారా పొందవచ్చని ఇది తన స్వానుభవమని , ఎన్నో నిదర్శనాలు కూడా తనకు తెలుసునని తెలిపారు.
హైకూని ఆస్వాదించాలంటే ఒక పదినిమిషాలు ధ్యానంలో ఉండి ఆలోచనలను తగ్గించుకుని హైకూని చదివితే ఆ అనుభూతి మనకు దొరుకుతుందని. అదేవిధంగా ఒకటిరెండు చదివినంతమాత్రాన హైకూతత్వం గ్రహించడం కష్టమని, వానచినుకులు ఒకటి రెండు పడితే అది వాన అవ్వదని తెలిపారు. హైకూని అందరూ ఆదరించాలని అది మన జీవితాన్ని ఆనందమయం చేస్తుందని సూచించారు.
చివరగా సంస్థ కార్యదర్శి శ్రీ జక్కు రామకృష్ణగారు వందన సమర్పణ చేశారు.

19, సెప్టెంబర్ 2009, శనివారం

మూడువందల యాభైయ్యవ సభ

హైకూ అందాలు

అధ్యక్షులు : శ్రీ ఎన్. ఆర్. శ్రీనివాసరావు
(కార్యదర్శి, కె. ఎల్. నరసింగరావు మెమోరియల్ సొసైటి, విజయనగరం)
వక్త : శ్రీ రెంటాల వేంకటేశ్వరరావు, ఎం.ఎ;పిహెచ్.డి
(ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్. కోట)
విషయం : హైకూ కవిత్వం
సమ్మానకర్త : శ్రీ రావి. ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 27-09-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభ

బాలభారతి

స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభావన మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభలో విజయనగరంజిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులపై సాలూరుకుచెందిన రచయిత కిలపర్తి దాలినాయుడుగారు ప్రసంగించారు.
బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సభకు బగ్గం రామజోగారావుగారు అధ్యక్షత వహిస్తూ సాహిత్యంలో విజయభావన చేసిన కృషిని ప్రశంసించారు. విజయభావన సహాయకార్యదర్శి శ్రీమతి ఎ. లలితా శంకర్ గారు సమ్మానకర్తగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి డా|| ఎ. గోపాలరావు గారు స్వాగత వచనాలు పలికి అతిథుల్ని సభకు పరిచయంచేశారు. దాలినాయుడుగారు బాలసాహిత్యానికి వివిధ స్థాయిలలో చేస్తున్న కృషి, ఆయన పొందిన పురస్కారాలు తెలిపి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన దాలినాయుడుగారి ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు:
పద్ధెనిమిదవ శతాబ్దం తరువాత ముద్రణలోకి అనేక బాల కథలు వచ్చాయి.
పొడుపుకథలు, దేశభక్తి, వీరగాథలు వంటి ఎన్నో అంశాలు బాలసాహిత్యం పాటలద్వారా పిల్లలలో ఆసక్తి రేపి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడేలా చేసింది.
ఏవిధంగా అయితే పాలు సంపూర్ణ ఆహారంగా పిల్లలకు ఉపయోగ పడుతుందో అదేవిధంగా బాలసాహిత్యం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది.
పాత చందమామల దగ్గరనుండీ నేటి నాని పత్రిక వరకూ బాల సాహిత్యంలో సృజనాత్మతకు అద్దం పడుతున్నాయి.
జిల్లాలోని బాల సాహిత్యం గురించి మాట్లాడుతూ ఈ జిల్లాలోనే ఎక్కువ కృషి జరిగిందని తెలిపారు. గురజాడ వంటి మహాకవులదగ్గరనుండి నేటి తరంలో ఎ.బి సుబ్బారావు, రఘునందం మొదలైనవారి వరకూ అనేకమంది ఇందులో కృషిచేస్తున్నారని అన్నారు.
ఉదాహరణగా కొన్ని కథలు, పాటలు వినిపించారు.
పార్వతీపురానికి చెందిన బి. వి. పట్నాయక్ గారు వ్రాసిన రాజు-విగ్రహం అనే కథ ద్వారా మంచిపనులు చేయవలెనని సూచించారని తెలిపారు. ఒక రాజుగారు తన విగ్రహాలని స్థాపించాలని ఆలోచించి మంత్రిగారితో చర్చించారు. ఒకనాడు ఆ మంత్రి, రాజు ఉద్యానవనంలో విహరిస్తుండగా కాకి రాజుగారి మీద రెట్టవెసిపోయింది. అది తుడుచుకున్న తరువాత రాజుగారికి తన విగ్రహం పెడితే ఎన్నోకాకులు ఇలా రెట్టలు వేస్తూ ఉంటాయి. మరి తుడిచేవారెవరు అన్న అనుమానం వచ్చింది. చివరకు మంత్రిగారి సలహామీద పేరు నిలవాలంటే విగ్రహాలు నిలబెట్టడంకన్నా మంచిపనులు చేయవలెనని గుర్తించి ఆవిధంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
పాటల ద్వారా సైన్సు పాఠాలను కూడా చెప్పవచ్చని తెలుపుతూ తను వ్రాసిన ఎందుకని - ఎందుకని అనే గేయాన్ని వినిపించారు.
ఎందుకని -ఎందుకని
దీపం నిత్యం పైకే కాలును ఎందుకని - ఎందుకని
అలాగే గణిత పాఠాలు నేర్పవచ్చన్నారు.
తెలుగు చక్కగా రావడానికి బలసాహిత్యం తిరుగులేని మాధ్యమం అని అన్నారు. అక్షరాలు పలకడం అలవాటు కావడానికి, ఒకే అక్షరం ఎక్కువసార్లు ఉపయోగిస్తూ పాటలు వ్రాయవచ్చని సోదాహరణంగా వివరించారు.
ఇక వ్యక్తిత్వవికాసానికి సంబంధించి పాము కథని వినిపించారు. ఒక ముని పాముని సాధుజీవిగామారమని, కాటు వేయడం మానుకోమని ఉపదేశించి వెళ్ళిపోవును. ఆ పాము ఆ విధంగా జీవించడం మొదలుపెట్టింది. ఎవరు ఏంచేసినా ఎదురుతిరగకుండా ఉండేది. దానితో అందరూ రాళ్ళు వేస్తూ దానిని బాధించాసాగారు. అయినా అది అలాగే ఉంది. కొన్నాళ్ళకి ఆ ముని మరల వచ్చి పాము దీనస్థితిని చూశాడు. ఏమయ్యిందని అడిగితే మహాత్మా మీరు సాధుజీవిగా ఉండమన్నారు దాని ఫలితమే ఈ దెబ్బలు అని అన్నది. అది విని సాధువు నేను కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దనలేదు కదా! నీ ఆత్మరక్షణకు నీవు బుస కొట్టాలి. లేనిచో బ్రతుకు కష్టమగుని అని హితవు పలికెను. ఆ తరువాత పాము ఆ విధంగా చేస్తూ హాయిగా జీవించింది.
అదేవిధంగా చెడ్డవాళ్ళతో స్నేహం మంచిదికాదని చెప్పే నక్క, సింహం కథ ఉదహరించారు. ఒక అడవిలో సింహంతో సహా అన్ని ప్రాణులూ శాఖాహారులై కలసి మెలసి జీవించేవి. ఒక నాడు ఒక నక్క ఎక్కడినుండో వచ్చింది. ఇక్కడి పరిస్థితి గమనించింది. మాంసం తినాలనే కోరికతో అది సింహంతో స్నేహంచేసి జంతువులను తినవలెనని బోధ మొదలెట్టింది. ఇది గ్రహించిన సింహం దానిని కనపడ వద్దని పంపివేసింది. ఆ నక్క మెల్లిగా సింహం పిల్ల దగ్గర చేరింది. సింహంలేని సమయంలో సింహంపిల్లకు ఒక కుందేలుని చంపి మాంసంరుచి చూపించింది. కొంత అలవాటు చేసినతరువాత ఇక తను మాంసం ఇవ్వలేనని సింహాన్నే అడగమని పురిగొల్పింది. సింహం పిల్ల తండ్రి దగ్గర మాంసంకావాలని గోల చేసింది. ఈ కోరిక పుట్టడానికి వెనుకాల వేరే ఎవరో ఉండి ఉంటారని పసిగట్టిన సింహం ఆరా తీసి నక్క పని అని కనుక్కుని మళ్ళీ ఈ అడవికి వస్తే తాను తినబోయే మొదటి జంతువు ఆ నక్కే అవుతుందని హెచ్చరించి దానిని తరిమికొట్టింది. సింహం పిల్లను మంచి మాటలతో బోధచేసి, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పింది.
అలాగే పిల్లచే కథలు, కవితలు వ్రాయించిన వారిలోని సృజనాత్మకత మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఉదాహరణగా పాలు, డోలు, మేలు మొదలైన పదాలు ఇచ్చి వాక్యం చివర ఇవి వచ్చేలా వ్రాయమని అన్నప్పుడు,
ఆవు ఇచ్చును తెల్లని పాలు
ఆవు మెడలో గంగడోలు
ఆవు చేయును ప్రజలకు మేలు .. అంటూ ఒక చిన్న పిల్ల వ్రాసిన కవితలో గంగడోలు అన్న పదం మామూలుగా ఎవరికీ తెలియదని. దానిని అక్కడ వాడడంలో ఆ చిన్నారి చూపిన నేర్పు అభినందనీయమని కొనియాడారు.
ఆపైన ప్రభుత్వం బాలసాహిత్యానికి చేస్తున్నకృషిని కూడా వినరించారు.
బాలలవాణి అనే సంస్థద్వారా ప్రభుత్వం పిల్లల ప్రచురణల కార్యక్రమం చేపట్టిందని, డైట్ ప్రముఖులు ఆధ్వర్యంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందిపబడ్డాయని తెలిపారు. ఈ పిల్లల రచనలలో సుమారు ఇరవైఆరువేల బాలల రచనలు ఒక్క విజయనగరం జిల్లానుండే అందాయని. ఇది ఇక్కడి ఉపాధ్యాయుల కృషి ఫలితమని శ్లాఘించారు. శ్రీ శాంతిస్వరూప్ గారి సంపాదకత్వంలో పుస్తకాలు కూర్చబడి, జోనల్ వారీ గా పాఠశాలలకు ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.
కార్టూనిష్టుగా ఉన్న తను బాలసాహిత్యం పై ఆకర్షితుడనై ఈ రంగంలో కృషిచేస్తున్నాని తెలిపారు.