2, డిసెంబర్ 2009, బుధవారం

తెలుగు వెలుగు

సభాప్రారంభాన్ని చేస్తూ డా|| ఎ. గోపాలరావు, శారదరాత్రులలో పూర్ణచంద్రుని, సుధాకరుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదని చమత్కరిస్తూ అధ్యక్షులైన సుధాకర్ గారిని, వక్త పూర్ణచందు గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. అటుపైన సమ్మానకర్త ఇందిరాంబగారికి ఆహ్వానం పలికారు. ప్రార్థన శ్రీ పంతులు చేయగా, అధ్యక్షులు శ్రీ సుధాకర్ మాట్లాడుతూ సాహిత్యకార్యక్రమాలలో పాల్గొంటే మంచి ఆలోచనలు వస్తాయని, జ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. విజయభావన సంస్థగురించి చెబుతూ ఇన్నేళ్ళూగా నిర్విరామంగా పనిచేస్తున్న సాహిత్య సంస్థ మరోటి లేదని కొనియాడారు. తనకు సాహిత్యంలో ప్రవేశం లేకపోయినా, చేసేవాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఉత్తమమని భావించి వస్తూన్నానని తెలిపారు. సమ్మానకర్త కుమారి ఇందిరాంబ మాట్లాడుతూ విజయభావన కీ||శే|| ఆచార్య భావన్ గారి సంకల్పబలం చేత, అందరిసహకారం చేత, సభ్యుల అంకితభావం చేత విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. అనంతరం వక్తను సత్కరించారు.

సమ్మానకార్యక్రమానంతరం వక్త శ్రీ పూర్ణచందు తెలుగు భాష ప్రాచేనత- నూతన పరిశోధనాంశాలు అనే విషయం పై ప్రసంగిస్తూ విజయభావనలో ప్రసంగించడం ఒక యోగ్యతా పత్రంగా భావిస్తాంమని, తను చెప్పాలనుకున్న అంశాలను సాంస్కృతికరాజధాని గా భావించే విజయనగరంలో చెప్పాలని తన ఆకాంక్ష అని, అది తనబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. (ఆసమయంలో కరెంటు పోయింది. కొవ్వత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం ప్రయత్నించగా సభలో ఎవరివద్దా దొరకలేదు. గ్రంథాలయం సిబ్బంది సకాలంలో వేరే ఏర్పాటు చేశారు. దీనిని చమత్కరిస్తూ శ్రీ పూర్ణచందు ‘విజయభావన సభకు వచ్చేవాళ్ళదగ్గర అగ్గిపెట్టె దొరకదు, అగ్గి పెట్టే వాళ్ళూ దొరకరు. ఇంతటి సంస్కారవంతులు కనుకే తను ఇక్కడ ఉపన్యసించాలనుకుంటున్నా’ అని అని నవ్వులు పూయించారు). సభ చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రభావితం చెయ్యగల వ్యక్తులు ఉంటే అది మహా సభ అవుతుందని అటువంటి ఈ మహా సభ కు వందనం చేస్తున్నానని తెలిపి ప్రసంగాన్ని ప్రారంభించారు.

గమనిక : విషయం యొక్క క్లిష్టతచేత, కేవలం అప్పటికప్పుడు విని వ్రాసుకున్న విషయాలను ఆతరువాత కూర్చి వ్యాసం చేయడం చేత వక్త చెప్పినదంతా వ్యాసంలో పొందుపరచలేకపోయి ఉండవచ్చు. అదేవిధంగా వ్యాసంలో కొన్ని తప్పులు, తేడాలు కూడా దొర్లి ఉండవచ్చు. దానికి మీకు, వక్త కి క్షమాపణ తెలుపుకుంటున్నాం. వ్యాసం చదివేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవలసిందిగా ప్రార్థన.

ఆ ప్రసంగ సారాంశం :
ఇక్కడ నేను రెండు విషయాలు పై మాట్లాడదలుచుకున్నాను. ఒకటి తెలుగు భాష ప్రమాదం అంచున ఉన్నదా అన్న ప్రశ్న. ప్రస్తుతం ప్రధానంగా ముప్ఫై ఏడు భాషలు మరణించే స్థితిలో ఉన్నాయి. నిజానికి భాష ఎక్కడికీ పోదు. గ్రంథాల రూపంలో, శాసనాల రూపంలో, ఇతర మాధ్యమాల రూపంలో ఉంటుంది. అయితే అది ప్రజల నాలుక పై ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఉదాహరణకి సంస్కృతం ఇప్పటికీ గ్రంథాలలో సజీవంగానే ఉంది. అయితే ఎంతమంది దానిని వాడకంలో ఉపయోగిస్తున్నారు? ఇక తెలుగు విషయానికి వస్తే ‘ బస్ స్పీడ్ గా పోతుంది’. ఇది సాధారణంగా అనే వాక్యం. ఇందులో ‘పోతుంది’ అనే వాక్యం ఒక్కటే తెలుగు పదం. ఇదెప్పుడు ‘పోతుందో’ తెలియదు! ప్రస్తుతం తెలుగు రాదని చెప్పడం గొప్పగా భావించడం వల్లే మరణిస్తోంది. అంతమాత్రంచేత తెలుగు భాషోద్యమం ఇతరభాషలుకు వ్యతిరేకం కాదు. మన భాషను ప్రేమించడానికి, భాషపై అభిమానాన్ని పెంచడానికి మాత్రంమే మా (తెలుగు భాషోద్యమం) ప్రయత్నం. ఇక్కడ గుర్తుంచుకోవలసింది, ప్రజాభిమతంలేని రాజకీయం భాషాదురభిమానానికి దారితీస్తుంది. ఉదాహరణకి మహారాష్ట్రా. ప్రజాభిమతంతో రాజకీయం జోడైతే సత్ఫలితాలిస్తుంది. ఉదాహరణకి తమిళనాడు. ప్రజాభ్జీష్టం మేరకు తమిళానికి ప్రాచీనహోదా కోసం డి.ఎం.కె ప్రభుత్వం కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి, కమిటీ వేయించారు. వాళ్ళు నో అబ్జక్షన్ చెప్పినతరువాత ప్రాచీన హోదాను కల్పించారు. అప్పుడు తెలుగు వారికి వేడి పుట్టి ఆ వైపుగా కృషి జరిగింది. అయితే తెలుగుభాషోద్యమం అంతకు ముందు నుంచీ ఉన్నదే. నిజానికి గిడుగువారి వ్యవహారిక భాషోద్యమానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఆనాడు సంస్కృతపండితులు మొదలైన వారు అడ్డంకిగా ఉంటే ఇప్పుడు మామూలు ప్రజలే అడ్డంకిగా ఉన్నారు. తెలుగు భాష ఇంటిభాషగా, బడిభాషగా, ఏలుబడిభాషగా ఉండాలన్నదే మా అభిలాష.

ఇక పరిశోధనాంశాల విషయానికి వస్తే, ఇంకా గ్రంథస్థంకాని తాజా పరిశోధనాంశాలను మీ దృష్టికి తేవాలనే సంకల్పంతోనే ఇక్కడకు రావడం జరిగింది. ఈ మధ్య జరిగిన మైదుకూరు సంఘటన తెలిసినవిషయమే. జన్మలో తెలుగులో మాట్లాడనని వ్రాయించి, తెలుగుపై ధ్వేషంన్ని పెంచుతున్నారు. ఇటువంటి సంఘటన మొదటిది కాదు, చివరిదీ కాబోదు. అది అలా ఉంచితే, తాజాగా వచ్చిన ఒక వార్త. ఈ నవంబరు ఐదున ఒక జర్మన్ వెబ్సైట్లో పరిశోధకులు తమ పరిశోధనా వివరాలను ఉంచారు. అప్పుడే పుట్టిన సద్యోజాత శిశువు ఏడుపు మాతృభాషలో ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకై వారు అప్పుడే పుట్టిన ఫ్రెంచ్ పిల్లల, జర్మన్ పిల్లల ఏడుపులు విశ్లేషించారు. తేడాలు గమనించారు. జర్మన్ పదాలు హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. అదే ఫ్రెంచ్ లో అయితే సాధారణంగా తగ్గు స్వరాలనుండి హెచ్చు స్వరాలకు వెళ్తాయి. పిల్లల ఏడుపులు సరిగ్గా వీటికి సరిపోయాయి. ‘ఎవరి ఏడుపు వారిదే మరి!’ . ఇక తెలుగు భాషలో సాధారణంగా హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. దానికితగ్గట్టే మామనవరాలి ఏడుపు ను గమనించాను. ‘ఉంగా’ అన్నప్పుడు మొదటి అక్షరం హెచ్చు స్వరంతోనూ, రెండవ అక్షరం తగ్గుస్వరంతోనూ పలుకింది. అంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకుకూడా మాతృభాషా జ్ఞానం ఉంటుంది. ఈ విషయాలపై సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆయన ప్రకారం బిడ్డ కడుపులో ఉండగానే (ముఖ్యంగా 8,9,10 నెలలలో) మనసు ఏర్పడుతుంది. నిజానికి మన భారతీయులు ఎప్పుడో నాలుగు నెలలు నిండిన గర్భిణిని ‘దౌహృదిని’ (రెండు మనసులు కలది ) అని నిర్ణయించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనిషిలో conscious, unconscious, preconscious స్థితులు ఉంటాయి. ఇవే ed, ego, super ego గా పనిచేస్తాయి (Georg Groddeck ). లోపల మనసునుంచి అనేక ప్రేరణలు కలుగుతాయి. ఇది ed వల్ల జరిగుతాయి. వాటికి అనుగుణంగా చెయ్యమని ego చెబుతుంది. అలా చెయ్యవద్దని చెప్పేదే super ego . వీటిని మనం సత్వరజస్తమో గుణాలుగా చూడవచ్చు (సత్వగుణం - super ego, రజోగుణం - ego, తమోగుణం - ed ) . చంటిపిల్లలు తమోగుణం కలిగినవారు. ఏం అనిపిస్తే అది చేసేస్తారు. యుక్తాయుక్త విచక్షణలేని unconscious స్థితిలో ఉంటారు. ఆస్థితిలోనే తల్లి ఆలోచనలను, సంస్కృతిని, మాటలను మనసుచే ఆకళింపు చేసుకుంటుంది. మూడేళ్ళవరకూ మాతృభాషలోనే మనసు గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. ఆరేళ్ళునిండకుండా స్కూలుకి వెళ్ళినప్పుడు బలవంతంగా ఏకమాధ్యమాన్ని రుద్దితే దాని ప్రభావంచేత guilty conscious ఏర్పడుతుంది. తెలుగులో ఆలోచిస్తూ తప్పుచేశానన్న అపరాధ భావన చే ఆత్మనూన్యతా భావం, అనేక personality disorders . ఇతరభాషలు నేర్చుకోవండంలో తప్పు లేదు ఆరేళ్ళతరువాత అవి నేర్చుకోవచ్చు. అయితే ఈ కార్పరేట్ స్కూల్స్ లో చదివిన వారికి isolation పెరిగి, peer group మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. మన సంస్కృతి నుండే భాష ఏర్పడుతుంది. సంస్కృతికి తగ్గట్టుగా భాషా పదాలు ఉంటాయి. అలా అని చెప్పి సంస్కృతపదాలు పెట్టేసి అది తెలుగు అనడం కూడా సరికాదు.

ఇక ఫ్రాయిడ్ కలల గురించి చెబుతూ, కలలలో వ్యక్తిగత విషయాలే కనిపిస్తుంటాయి, అవి మాతృభాషలోనే ఉంటాయి అని అంటారు. కలలకు కారణాలు, వాటిద్వారా అందే సంకేతాలు మాతృభాష పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక బ్రిటన్ వానికి కలలో పిల్లి కనిపిస్తే there are many ways to peel a cat' అన్న వారి నానుడి ప్రకారం అతను చేయబోయే పని కి ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటిని ఆలోచించమని చెప్పినట్టు లెఖ్ఖ అవుతుంది. అదే తెలుగు వాడికి పిల్లి కలలోకొస్తే మన జాతీయాలకి అనుగుణంగా అర్థం ఉంటుంది. (‘పిల్లి కళ్ళుమూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడటంలేదు అనుకుంటుంది’ మొదలైనవి). నిజానికి మనసు కేవలం మాతృభాషలో ఉంటుంది. కనుక ధారణ చేస్తే దానిలో చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. అందుకే సైన్సు పాఠాలలో సంస్కృతాన్ని వీడి తెలుగుకు ప్రాధాన్యతనిస్తే సులువుగా ఉంటుంది. ఉదాహరణకి ఫెర్న్ మొక్క యొక్క ‘ circinate vernation ’ అన్న దానికి ‘వలితకిసలయ విన్యాసం’ అని తెలుగు పుస్తకంలో అనువదిస్తే ఉభయభ్రష్టత్వంతప్ప ఉపయోగం ఉండదు. ఈ విధంగా చేయడం వల్లనే తెలుగు మీడియం చదువులు దెబ్బతిన్నాయి. అదే తెలుగులో సరళీకరించి ఉంటే తెలుగు మీడియం మరింత అభివృద్ధి చెంది ఉండేది. పెళ్ళిమంత్రాలు సంస్కృతంలో చదివి ఉపయేగం ఏమిటి. తెలుగులో చెబితే సులభంగా అర్థం మనసుకు తెలుస్తుందికదా! దేవునికి తెలుగురాదనా? మధ్యలో వేరొకరు ఏదో అంటే ‘మమ’ అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
అప్పటి భాషోద్యమాన్ని తీసుకుంటే తెలుగులో వ్రాయడం చిన్నతనంగా భావించేవారు పండితులు. అదే ఈరోజు తెలుగులో మాట్లాడడమే తక్కువగా భావిస్తున్నారు ప్రజలు.

నిజానికి మన తెలుగు భాష యొక్క మూలాలను గురించి చూస్తే, ఇది ద్రవిడ భాషా కుటుంబానికి (ప్రచారంలో ఉన్న పదం) చెందినది. మనదేశంలో ద్రవిడభాషాకుటుంబం, ఇన్డో ఆంగ్లో కుటుంబం, ముండా భాష కుటుంబం, చైనా కుటుంబాలు వున్నాయి. ఈ భాషా విషయాలపై ఎంతోమంది ప్రస్తుతం కృషిచేస్తున్నారు. ముఖ్యంగా Michael Weiss, Werner Winter, Bernard Vincent విశేష కృషి చేస్తున్నారు. F.B.J. Kuiper ఋగ్వేదంలో వేదభాషకు సంబంధంలేని పదాలు మూడువందలు ఉన్నాయని కనుగొన్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి సంస్కృతవాఙ్మయ చరిత్రలో వేదభాషగురించి, సంస్కృత భాషగురించి విపులంగా వివరించారు. తెరువాత పరిశోధనలలో సుమారు ఎనిమిది వందలు పదాలు ఇండో యూరోపియన్ భాషకు చెందని పదాలు కనుకున్నారు. ఉదాహరణకి గజ, పతి , కూర్పాసం ఇతర భాషా పదాలు. ఈ పరిశోధనలద్వారా ఈ భాషలకు మూలమైన proto indo european భాషను reconstruct చేశారు. అదేవిధంగా ప్రోటో ద్రవిడియన్ ఫ్యామలీ ని గుర్తించారు. ఇందులో నార్త్ ప్రోటో ద్రవిడ (బ్రాహులి - ఆఫ్గన్లో మాట్లాడే ఒక భాష), సెంట్రల్ ప్రోటో ద్రవిడ (తెలుగు), సౌత్ ప్రోటో ద్రవిడ భాషలు (తమిళ, మళయాళం) ఉన్నాయి. వేదభాషలో ఎక్కువగా నార్త్, సెంట్రల్ ప్రోటో ద్రవిడభాషలనుండి పదాలు కనిపిస్తాయి. సౌత్ ప్రోటో ద్రవిడ భాషలకు సంబంధించిన పదాలు కనపడవు. (ప్రోటో ముండా భాషనుండి కూడా వేదభాషలోకి పదాలు వెళ్ళాయి. ఉదా: వరి అన్నపదం, అసలు ముండా అన్న పదం నుండే ముండనం మొదలైనవి వచ్చాయి.) పై విషయాలను చూస్తే ముందుగా తెలుగే విడివడి ఉండడానికి అవకాశం ఉంది కనుక తెలుగే తమిళంకన్నా ప్రాచీనం కావలసి ఉంది. సంస్కృతం కన్నా తెలుగు ప్రాచీనమా కాదా అన్న విషయాన్ని కూడా పరిశోధించవలసి ఉన్నది.

ఇక పూర్వం ఆర్కియాలజిష్టులు, డక్కన్ ప్రాంతంలో దొరికిన అవశేషాలను సైతము ఇన్డియన్ అని అనేసి వదిలేశారు దానివలన అది సింధునాగరికతకు సంబంధించినదే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. నిజానికి సింధునాగరికతకు సమాంతరంగా డక్కన్ భూభాగంలోనూ నాగరికత విరాజిల్లింది. ఇనుమును కరిగించగలిగారని కూడా ఆధారాలున్నాయి. మరి ఈ నాగరికతను తెలుగునాగరికత అని ఎందుకు అనరు? ఎందుకు అనలేదు? ఈ విషయమై మేము (కృష్ణా జిల్లా రచయితల సంఘం) సింధు కృష్ణా నాగరికతల సదస్సు ఏర్పాటు చేసి ఆర్కియాలజిష్టులను రప్పించి వాటిపై చర్చను పెట్టి కృష్ణా నగరికతపై ప్రసంగాలు ఇప్పించాము. (ఈ విషయాలు చూస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దండకారణ్యంలోకి వచ్చినతరువాతే అస్త్రాలు ఇవ్వడం, అర్జనుడు ఇక్కడ తపస్సు చేసే పాశుపతాన్ని పొందడం బహుశా ఇక్కడమాత్రమే అటువంటి ఆయుధాలు తయారు చేయగల సామర్ధ్యం ఉన్న నాగరికత ఉండడం వల్లనే నేమో అని సరదాకి అనిపిస్తుంది). రామాయణంలో ఇక్కడి నాగరికతకు సంబంధించిన విశేషాలు కొన్ని కనిపిస్తాయి.
నిజానికి తాళ వృక్షానికి ఆపేరు రావడానికి కారణం, తల పొడవు కనుక వచ్చింది. ఇది తాటి చెట్టుకు పేరు. ఇదే తాటి చెట్టులేని ఇతరప్రాంతాలలో కొబ్బరి మొదలైన పొడవుగా ఉండే చట్లకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తాటకి తెలుగింటి ఆడపడచు. దీనికి సిగ్గుపడాల్సిన పనిలేదు. చరిత్రని చరిత్రగా చెప్పుకుంటే రాముణ్ణి ఎదిరించినవారు మనవారని మనం గర్వంగా చెప్పవచ్చు. అంతమాత్రం చేత నాస్తికత్వమని తప్పుపట్టనక్కరలేదు.

ఇంకాస్త మీదకి వెళితే ‘చికున్ గునియా’ పై అమెరిగా పరిశోధకులు, అది ముందుగా కనిపించిన సొమాలియాలో పరిశోధనలు చేశారు. ఆ పదం యొక్క పుట్టుక సొమాలియాభాషలో ఉంది. వారి భాషలో ‘కుంగుంన్యాలా’ అంటే క్రుంగిపోయారు అని అర్థం. ‘చీ కుంగుంన్యాలా’ అంటే బాగా క్రుంగిపోయారు అని అర్థం. ఈ వ్యాధికి ఆ లక్షణం ఉంది కనుక వారు అలా పిలిచేవారు. ఇది మనం తెలుగులో ‘కుంగిపోయాడు’ అన్న మాటకు సారూప్యంగా కనిపిస్తుంది. నెల్లూరు యాసలో ‘కుంగున్యాడు’ అని అనడం కద్దు. దీనిబట్టి ఆఫ్రికాలోనీ తెలుగు భాష ఉన్నదని తెలుస్తుంది. ఒక ఉదాహరణకి ఇలా భావించలేకపోవచ్చు, కానీ ఇలాంటివి నూటయాభై ఇప్పటికే కనుగొన్నారు. వీటిని `Makers of Civilization' అనే పుస్తకంలో L.A. Waddell అనే పరిశోధకుడు పొందుపరిచారు.
అతని తన పరిశోధనలలో సుమేరియా నాగరికతనుండి ఆర్యులు వచ్చారని చెబుతూ బాబిలోనియాలో దొరికిన శిలాశాసనాలలో అనేక రాజవంశీకుల కథలు మన పురాణాలలో ఉన్నాయని వివరించారు. నిజానికి క్షత్రియులు అన్న పదం, బాబిలోనియన్లు ఉపయోగించే ‘KaTiTis’ అనే పదంనుండి వచ్చింది. ఇక ఆ పుస్తకంలో రాముడు, సగరుడు, హరిశ్చంద్రుడు, అసమంజసుడు మొదలైన మన పురాణవ్యక్తుల కథలు కనిపిస్తాయి. సగరుని వాళ్ళు సర్గన్ అని పిలుస్తారు. అతని కుమారుడైన అహమినిస్ కథ, సగరుని కుమారుడైన అసమంజసుని కథ పోలి ఉంటుంది. అట్లే నర్సింగ్ అన్న పదం మనిషి ముఖం సింహం శరీరం కలిగిన ప్రాణికి (ఈజిప్టు స్ఫినిక్స్ దేవత లా) వారికి ఉంది. దీనిబట్టి Sumerians are Aryans అనే విషయం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వచ్చిన నవీన ఆధారాల తో Early Sumerians are Dravidians అని అనవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలుగులోని కడవ, కమరచేయు, కలము (పడవ అనే అర్థంలో), చీరుట, ఇసుక, చిలువ, బూది, దొబ్బు, గూడు, కూన, మగ, చాటు, బెల్లం (చిన్నపిల్లాడి పురుషాంగం అర్థంలో) మొదలైన పదాలు ఇంచుమించు అవే అర్థంలో ఆఫ్రికా భాషలో కనిపిస్తాయి. దీనిబట్టి Bernard Sergent అనే అతను ఆఫ్రికా నైలు నాగరికత నుండి సుమేరియా, ఆపై ఇరాన్ మీదుగా ఒక గుంపు మీదకి రెండవ గుంపు సింధు, కృష్ణా నాగరికతలు గా విస్తరించాయని సూత్రీకరించారు. అయితే తాజా పరిశోధనలో ఇరాను నుండి సముద్రమార్గం ద్వారా నేరుగా డక్కన్ లోకి వచ్చారని, ఋగ్వేదకాలానికే డక్కన నాగరికత విలసిల్లుతూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకి, బాబిలోనియలో ఒక రకం వస్త్రాన్ని సింద్ అనేవారని ఆర్కియాలజిష్టులు అది సింధు నాగరికతనుండి వచ్చింది కాబట్టి ఆపేరు వచ్చిందని నిర్ణయించేశారు. అయితే ఇది సిందురము (రంగు) వస్త్రము కనుక దానికి ఆపేరు వచ్చింది. ఇది బహుశా మన మచిలీ పట్నం ప్రాంతంలో తయారు చేయబడి ఇతరదేశాలకి వెళ్ళింది.

(ప్రసంగానంతరం ప్రశ్నాకార్యక్రమంలో ‘మరి తెలుగు అంత ప్రాచీనమైతే పెళ్ళి మంత్రాలు తెలుగులో కాకుండా సంస్కృతంలోనే ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.)
మధ్యయుగంలో వచ్చిన మార్పుల చేత సంస్కృతం ప్రబలమయ్యింది కానీ నిజానికి అంతకు ముందు ఇక్కడ తెలుగునాగరికత సంస్కృతి ఉండేవి. ఉదాహరణకి తాళి కట్టడం అనేది ముందు లేదు. తాళి అన్నది తెలుగు పదం. ముస్లిం దండయాత్రల కాలంలో పెళ్ళైయ్యిందనేందుకు చిహ్నంగా తాటి ఆకుతో చేసినది ధరిచడం మొదలుపెట్టారు. అందుకే దానికి తాళి అన్నపేరువచ్చింది. ఆ తరువాత అనేక అన్యాయమైన, వెర్రి మార్పులు చేసి స్త్రీ స్తనముల రూపంలోని మంగళసూత్రాన్ని మొదలెట్టారు, పెళ్ళి తంతుని ఏర్పరిచారు. అంతకుముందు ఈ ప్రాంతంలో ఉండే ఆచార వ్యవహారాలు వేరు.

ఈ ప్రసంగానికి స్పందిస్తూ శ్రీ ఉపాధ్యాయుల నరసింహమూర్తి, శాస్త్రీయ ప్రసంగాన్ని కర్కశంగా కాకుండా సరళంగా చెప్పారు. చెప్పిన విషయాలు, వచ్చిన ఫలితాలు నూటికి నూరుపాళ్ళు సరికాకపోవచ్చు అని ఆయనకూడా ఒప్పుకుంటారు. ఇంకా భాషాసంబంధమైన విషయాలలో పరిశోధనలు ఒక కొలిక్కి రాలేదు. అయితే తెలుగువారి ఉనికిని, స్థితిని గుర్తించడానికి వక్త చేస్తున్న కృషి అభినందనీయం. ఈత్రోవలో ఆయన మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నను. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కోవలసింది వ్యాపారప్రాబల్యాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని కాదు సాంస్కృతిక ప్రాబల్యాన్ని. ఇది చాలా కష్టమైన పని. దీనికి ఉదాహరణ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ యొక్క దయనీయస్థితి. తెలుగు భాషకి నిజానికి కార్పరేట్ స్కూళ్ళకంటే, తల్లి దండ్రులే పెద్ద అడ్డంకిగా ఉన్నారు. ఇది తన ప్రత్యక్షంగా చూసిన నిజం అంటూ వక్తని అభినందిస్తూ ముగించారు.
చివరగా వందనసమర్పణ శ్రీ కె. శారదా ప్రసాద్ చేశారు.

1 కామెంట్‌:

  1. అద్భుతంగా వుంది. నిజంగా మీ కృషి అభినందనీయం. మీరు ఇంకా మంచి టపాలు రాయాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంత మంచి టపా వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.

    కృష్ణ

    రిప్లయితొలగించండి